అమెరికాలో అతిపెద్ద ఆసియా జనాభా సమూహంగా ఆసియా భారతీయులు
అమెరికాలో అతిపెద్ద ఆసియా జనాభా సమూహంగా ఆసియా భారతీయులు నిలిచారు.అమెరికా జనాభా లెక్కల సంస్థ (U.S. Census Bureau) అక్టోబర్ 29న విడుదల చేసిన తాజా ‘అమెరికన్ కమ్యూనిటీ సర్వే (ACS)’ అంచనాల ప్రకారం, 2025 నాటికి యునైటెడ్ స్టేట్స్లో కేవలం “ఏషియన్ ఇండియన్” (ఆసియా భారతీయులు) గా మాత్రమే గుర్తించుకున్న వారి సంఖ్య సుమారు 5.41 మిలియన్లకు (54.1 లక్షలు) చేరింది. ఈ క్రమంలోనే అమెరికాలో అతిపెద్ద ఆసియా జనాభా సమూహంగా అవతరించింది.
ఈ సంఖ్య 2024లోని 5.09 మిలియన్ల నుండి 3,15,000 కంటే ఎక్కువ పెరిగింది (సుమారు 6.2 శాతం పెరుగుదల). అమెరికా మొత్తం జనాభా (సుమారు 341.8 మిలియన్లు) లో ఈ విభాగానికి చెందినవారు దాదాపు 1.6 శాతంగా ఉన్నారు.
కేవలం ఒకే జాతి గుర్తించే కొలమానం ప్రకారం, ఆసియా భారతీయుల జనాభా చైనా జనాభాను (తైవాన్ను మినహాయించి) అధిగమించింది. ఇది గమనించాల్సిన పరిణామం. చైనీయుల జనాభా సుమారు 4.65 మిలియన్లుగా నమోదైంది.
అయితే, ఒకటి కంటే ఎక్కువ జాతులు లేదా శ్వేత/నల్లజాతి వంటి ఇతర సమూహాలతో కలిపి తమను తాము గుర్తించుకునే వారిని పరిగణనలోకి తీసుకుంటే ఈ లెక్క మారిపోతుంది. విస్తృతమైన ఆసియా భారతీయ జనాభా — అంటే ఏషియన్ ఇండియన్ మాత్రమే లేదా వేరే సమూహంతో కలిపి గుర్తించుకున్నవారు — 2025లో 5.91 మిలియన్లుగా అంచనా వేయబడ్డారు (2024లో ఇది 5.56 మిలియన్లు). దీనికి సరిపోలే చైనా జనాభా (తైవాన్ను మినహాయించి) కొద్దిగా ఎక్కువగా సుమారు 5.97 మిలియన్లుగా ఉందని నిపుణుల అభిప్రాయం.
ఇక.. రాష్ట్రాల వారీగా ఆసియా భారతీయ జనాభాను తీసుకుంటే దాని లెక్కలు కూడా తీశారు. దాని ప్రకారం అన్ని రాష్ట్రాల కంటే కాలిఫోర్నియాలో అత్యధికమైన లెక్క తేలుతోంది. అంటే సుమారు 1.02 మిలియన్ల ఆసియా భారతీయ జనాభా వున్నారు. ఆ తర్వాత టెక్సాస్ లో 7,08,000, న్యూజెర్సీలో 4,71,000, న్యూయార్క్ లో 4,20,000, ఇల్లినోయిస్ లో 2,88,000, ఫ్లోరిడాలో 2,39,000 మంది వున్నట్లు లెక్కలు తేలుతున్నాయి. ఈ ఆరు రాష్ట్రాలు కలసి సుమారు 3.15 మిలియన్ల ఆసియా భారతీయ నివాసితులను కలిగి ఉన్నాయి, ఇది దేశవ్యాప్త మొత్తం సంఖ్యలో దాదాపు ఐదింట మూడు వంతులకు సమానం. ఒక్క కాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రాల్లోనే 1.7 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఉన్నారు.
యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తున్న భారత్లో జన్మించిన వారి సంఖ్య 2025 నాటికి 3.40 మిలియన్లకు పెరిగిందని ACS తెలిపింది. ఇది అంతకుముందు సంవత్సరం ఉన్న 3.16 మిలియన్ల కంటే 7.6 శాతం ఎక్కువ.అమెరికాలోని విదేశీ మూలాలు కలిగిన జనాభాలో అత్యధికంగా ఉన్న దేశాల్లో మెక్సికో (10.61 మిలియన్లు) మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండవ స్థానంలో కొనసాగుతోంది. హాంగ్కాంగ్, తైవాన్లను మినహాయించి చైనాలో జన్మించినవారు 2.40 మిలియన్లతో మూడవ స్థానంలో, ఫిలిప్పీన్స్ 2.24 మిలియన్లతో తదుపరి స్థానంలో ఉన్నాయి.యునైటెడ్ స్టేట్స్లోని మొత్తం విదేశీ మూలాలు కలిగిన జనాభా సుమారు 50.41 మిలియన్లుగా అంచనా వేశారు.







