అమెరికాలో ఘనంగా ముగిసిన మహానాడు

అమెరికాలో రెండు రోజులపాటు డల్లాస్ నగరంలో ఘనంగా జరిగిన ఎన్నారై తెలుగుదేశం మహానాడు ముగిసింది. అమెరికాలో తొలిసారిగా జరిగిన మహానాడుకు అమెరికాలోని వేర్వేరు రాష్ట్రాల నుంచి దాదాపు 2000 మంది టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ మహానాడుకి ముఖ్య అతిథులుగా మంత్రి గంటా శ్రీనివాస్, ఎంపీ సీఎం రమేష్, టీటీడీ బోర్డు సభ్యులు పెద్దిరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు, మాజీ జడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జై రామ్, ఎన్నారై టీడీపీ ముఖ్య నాయకులు సతీష్ వేమన, మన్నవ మోహన కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మొదట టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ నాయకులు పలు తీర్మానాలు ప్రతిపాదించి నాయకుల సమక్షంలో ఆమోదించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ అమెరికాలో ఇంత చక్కగా మహానాడుని నిర్వహించినందుకు ఎన్నారై తెలుగుదేశం విభాగాన్ని అభినందించారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయ్యాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు అందరూ సంఘటితంగా పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన సంగీత విభావరి ఆహుతులను ఎంతగానో అలరించింది.











































































