డల్లాస్ లో ఘనంగా మహానాడు

డల్లాస్ లో మొదటిసారిగా ఎన్నారై తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహానాడు అత్యంత ఉత్సాహంగా, కోలాహలంగా ప్రారంభమైంది. రెండురోజులపాటు జరిగే ఈ వేడుకల్లో పాల్గొనేందుకోసం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ ప్రముఖులతోపాటు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అమెరికా నలుమూలలా ఉన్న తెలుగుదేశంపార్టీ అభిమానులు తరలివచ్చారు. పసుపుజెండాలతో వేడుకలు జరిగిన ప్రాంతం సందడిగా కనిపించింది. దాదాపు 1600 మంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి పెద్దిరెడ్డితోపాటు అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరాం కోమటి, తానా అధ్యక్షుడు సతీష్ వేమనతోపాటు డాలస్ ప్రముఖులు డా. గొర్రెపాటి నవనీత కృష్ణ, డా. సూద్నగుంట రాఘవేంద్ర ప్రసాద్ తదితరులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ నగరాల్లో ఉన్న ఎన్నారై తెలుగుదేశం పార్టీ విభాగాలు తమ ప్రాంతంలో పార్టీకోసం చేస్తున్న కార్యక్రమాలను వచ్చే ఎన్నికల్లో తాము పార్టీకి మద్దతుగా చేయనున్న కార్యక్రమాలను వివరించారు. అట్లాంటా, అస్టిన్, హ్యూస్టన్, లాస్ ఏంజెలిస్, సియాటెల్, న్యూజెర్సి, వాషింగ్టన్ డీసి, మేరీలాండ్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు.











































































