రిలీజ్ కు ముందే విషాదం : తెలంగాణ యంగ్ హీరో దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో యువ సినీ హీరో అస్లాం కన్నుమూశాడు. వరంగల్ కు చెందిన అస్లాం వరంగల్-హైదరాబాద్ జాతీయరహదారిపై ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయాడు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ రైల్వేగేట్ ప్రాంతం 18వ డివిజన్ శివనగర్‌కు చెందిన సరోహా రూపేష్, ఫరిజానా(ఫాతిమా) దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు అస్లాం మూడేళ్ల కిత్రం హైదరాబాద్‌కు వచ్చాడు. తొలిరోజుల్లో చిన్నపాటి ఉద్యోగంతో కాలం వెలిబుచ్చినా… యాక్టింగ్ పై ఇష్టంతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. అదృష్టం తలుపుతట్టి ప్రేమమయం అనే సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది. గత ఏడాది ప్రారంభమైన షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. త్వరలో ఆడియో రిలీజ్ ఉంది. జూలై తొలి వారం లేదా చివరి వారంలో సినిమా విడుదలకు సిద్ధం చేశారు. ఇదిలా ఉంటే.. రంజాన్ పండుకు అస్లాం వరంగల్ లోని సొంతూరుకు వెళ్లాడు. బుధవారం రాత్రి (జూన్ 28) కాజీపేటకు చెందిన తన ఫ్రెండ్ తో కలిసి టూవీలర్ పై హైదారాబాద్ బయల్దేరారు. హన్మకొండ–హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారిపై బీబీనగర్ సమీపంలో టూ వీలర్ అదుపుతప్పి.. డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్ లో అస్లాం స్పాట్ లోనే చనిపోయాడు. అతడి మిత్రుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, ప్రజా ప్రతినిధులు, సినిమా ప్రముఖులు తరలివచ్చి అస్లాంకి నివాళులర్పించారు.













