డిసెంబర్లో సాయిధరమ్ తేజ్ పెళ్లి సందడి.. నవంబర్ 5న నిశ్చితార్థం!
మెగా ఫ్యామిలీలో త్వరలో మరో శుభకార్యం జరగబోతోందనే వార్త ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మెగా హీరో సాయిధరమ్ తేజ్(sai dharam tej) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కుటుంబ సభ్యుల స్థాయిలో వేగం పుంజుకున్నాయని సమాచారం. నవంబర్ 5న హైదరాబాద్లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సాయిధరమ్ తేజ్ ఎంగేజ్మెంట్ ను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులంతా హాజరుకానున్నారని తెలుస్తోంది.
నిశ్చితార్థం తర్వాత పెళ్లికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ను సాయిధరమ్ తేజ్ స్వయంగా వెల్లడించే అవకాశం ఉంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని, కాబోయే వధువుకు సంబంధించిన వివరాలను ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నారని సమాచారం. డిసెంబర్లోనే పెళ్లి వేడుకను నిర్వహించాలని ఇరు కుటుంబాలు ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. అయితే పెళ్లి డేట్ పై నిశ్చితార్థం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశముంది.
మరోవైపు సినిమాల విషయానికి వస్తే సాయిధరమ్ తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు(sambarala yetigattu) షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేసేందుకు చిత్రబృందం రెడీ అవుతోంది. ఇక డైరెక్టర్ తేజ(Teja)తో తన తర్వాతి సినిమాను కూడా తేజ్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును 2027 సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఇలా ఒకవైపు కెరీర్లో కొత్త సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు జీవితంలో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతున్న సాయిధరమ్ తేజ్ వార్త ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.







