రవితేజ సోదరుడు భరత్ దుర్మరణం
ప్రముఖ సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్‌రాజు శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన ఆయన కారు (టీఎస్ 09 ఈసీ 0799) ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
శంషాబాద్-కొత్వాల్‌గూడ శివార్లలోని మద్దిమడుగు వద్ద శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఖరీదైన ఆ కారులో ఎయిర్బెలూన్లు ఉన్నా అతివేగం కారణంగా భరత్‌ను అవి కాపాడలేకపోయాయి. రవితేజ ముగ్గురు సోదరుల్లో భరత్ రెండో సోదరుడు. గచ్చిబౌలిలో తల్లి రాజ్యలక్ష్మితో కలసి ఉంటున్నారు. శనివారం రాత్రి శంషాబాద్ నోవాటెల్‌లో స్నేహితులు ఇచ్చిన విందులో పాల్గొన్నాడు. కొద్దిసేపు ఈతకొలనులో స్విమ్మింగ్ చేసి రాత్రి 10 గంటల సమయంలో నివాసానికి బయల్దేరారు.
ఈ ఘటనలో చనిపోయిన భరత్.. రవితేజ సోదరుడని గుర్తించడానికి కొంత సమయం పట్టింది. ఆదివారం ఉదయం ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించగలిగారు. భరత్ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు అనుమానిస్తున్నప్పటికీ.. పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప నిర్థారించలేమని పోలీసులు చెప్తున్నారు. భరత్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం నేరుగా జూబ్లీహిల్స్ రోడ్డులోని మహా ప్రస్థానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.








