ఈ సినిమా నటిగా నా జీవితాన్నే మార్చేసింది
భారతీయ సినీ పరిశ్రమలో ప్రభంజనం సృష్టించింది బాహుబలి2. కనీవినీ ఎరుగని రీతిలో రూ.వెయ్యి కోట్ల వసూళ్ల సాధించి, బాక్సాఫీసును షేక్ చేస్తోంది. అయితే బాహుబలి 2లో తన పాత్ర పరిధిని తగ్గించడంపై దర్శకుడు రాజమౌళిపై తమన్నా అసంతృప్తిగా ఉందని సినిమా విడుదల నుంచీ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రచార కార్యక్రమాల్లో తమన్నా పాల్గొనకపోవడంతో వీటికి మరింత బలం చేకూరింది. దీనిపై తాజాగా స్పందించిన తమన్నా అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేసింది. ఆ వార్తల్లో నిజం లేదు. ఏ పని లేనివాళ్లే ఇలాంటి పుకార్లను సృష్టిస్తున్నారు. బాహుబలి చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నా పాత్ర ఏంటో నాకు తెలుసు. రాజమౌళి సార్ అంటే నాకు చాలా గౌరవం. అవంతిక పాత్ర కోసం నన్ను ఎంపిక చేయడం పట్ల ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. ఇలాంటి గొప్ప చిత్రంలో నేను కూడా భాగం కావడం చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా నటిగా నా జీవితాన్నే మార్చేసింది. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పుకొచ్చింది తమన్నా.













