చిరు 151వ సినిమా ‘సైరా’ ఫస్ట్‌లుక్ విడుదల
చిరు 151వ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రచార చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. ‘సైరా’ అని టైటిల్ గా ఫిక్స్ చేసి నరసింహరెడ్డిని క్యాప్షన్ గా పెట్టారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఓ కోట శిఖరంపై కాలిపోతున్న ఆంగ్లేయుల జాతీయ జెండా, దాని చుట్టూ బ్రిటిషు సైనికుల శవాలు, కోట బయట నరసింహారెడ్డి.. ఈ దృశ్యాలతో ప్రచార చిత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ చిరంజీవిని వెనుక నుంచి చూపించారు. ఆయన ముఖం కనపడలేదు. ‘సై.. సైరా నరసింహారెడ్డి’ అనే నినాదాలు బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించాయి. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డబుల్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. రవివర్మన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనుండగా, పరచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ అందించారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు.













