బాలయ్య సరసన శ్రీయా!
నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో రెండో షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. తొలి షెడ్యూల్లో భాగంగా హీరోయిన్గా ఎంపికైన ముస్కాన్‌తో కలిసి యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించాడు దర్శకుడు పూరి. ముగ్గురు హీరోయిన్లు ఉండే ఈ మూవీలో ఇప్పుడు రెండో హీరోయిన్ను కూడా ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తోంది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్గా శ్రియాశరణ్ను ఎంపికచేశారని అంటున్నారు. బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో నటించిన శ్రియ అద్భుతమైన నటనతో తన టాలెంట్‌ను చూపించింది. చక్కటి అందం, అభినయంతో ఆకట్టుకునే శ్రియా బాలయ్య 101వ చిత్రంలో సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఆమెతో మాటమంతీ కూడా పూర్తయ్యాయని, త్వరలో అధికారికంగా ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.













