స్పిరిట్ కోసం సందీప్ రెడ్డి వంగా 100 రోజుల టార్గెట్
అర్జున్ రెడ్డి(Arjun reddy), యానిమల్(Animal) సినిమాలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga) ప్రస్తుతం తన తర్వాతి ప్రాజెక్ట్ స్పిరిట్(Spirit)పై పూర్తి దృష్టి పెట్టారు. ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. తన సినిమాల్లో హీరో క్యారెక్టర్‌ను అత్యంత స్ట్రాంగ్ గా చూపించే సందీప్, స్పిరిట్ లో ప్రభాస్‌ను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. పాత్రకు తగ్గట్టుగా ప్రభాస్ తన లుక్, ఫిజిక్‌పై కూడా స్పెషల్ కేర్ పెట్టి ఇటీవల మరింత ఫిట్‌గా కనిపిస్తున్నారు.
స్పిరిట్ షూటింగ్‌ను కేవలం 100 వర్కింగ్ డేస్‌లో పూర్తి చేయాలనే టార్గెట్ తో సందీప్ రెడ్డి వంగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, అందుకు అనుగుణంగా షెడ్యూల్స్‌ను ప్లాన్ చేస్తూ షూటింగ్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్లో 40%కి పైగా పూర్తయినట్లు సమాచారం. ఇటీవల జరిగిన షెడ్యూల్స్ కూడా అనుకున్న సమయానికి ముగియడంతో చిత్రబృందం సంతృప్తిగా ఉంది.
ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ(Fauzi) షూటింగ్లో పాల్గొంటున్నారు. ఆ సినిమా పూర్తైన తర్వాత మళ్లీ స్పిరిట్ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. షూటింగ్ ఆలస్యమైనా రిలీజ్ డేట్ పై ఎలాంటి ప్రభావం పడకుండా సందీప్ రెడ్డి వంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. త్రిప్తి డిమ్రీ(Tripti Dimri) హీరోయిన్గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామా 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.








