సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్పై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తన ఫ్యాన్స్ కు మరోసారి స్పెషల్ మెసేజ్ ఇచ్చారు. హైదరాబాద్లో నిర్వహించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) వార్షిక సమావేశంలో పాల్గొన్న ఆయన, ఫ్యాన్స్ ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేస్తూనే సోషల్ మీడియాలో అనవసర వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి విమర్శకు రియాక్ట్ అవడం లేదా ఇతరులను టార్గెట్ గా చేసుకుని ట్రోలింగ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఆ సమయాన్ని పర్సనల్ డెవలప్మెంట్, ఫ్యామిలీ, కెరీర్ వంటి మంచి విషయాలకు కేటాయించాలని ఆయన కోరారు. ఫ్యాన్స్ మధ్య జరిగిన సరదా సంభాషణలో యూత్ సోషల్ మీడియాలో వాదనలు చేయడం కంటే తమ జీవిత లక్ష్యాలపై దృష్టి పెట్టాలని చమత్కారంగా చెప్పడంతో సభలో నవ్వులు పూశాయి.
ఈ సమావేశంలో అల్లు అర్జున్ మరో ముఖ్యమైన డెసిషన్ ను కూడా ప్రకటించారు. ఫ్యాన్స్ అసోసియేషన్లో నమోదు చేసుకున్న సభ్యులకు, వారి కుటుంబాలకు భద్రత కల్పించే ఉద్దేశంతో ప్రత్యేక ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించారు. ఈ డెసిషన్ ను ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించారు. సినిమా సక్సెస్లకే పరిమితం కాకుండా అభిమానుల సంక్షేమంపై కూడా దృష్టి పెట్టడం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు. కార్యక్రమం అనంతరం అభిమానులతో కలిసి భోజనం చేయడంతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన పోర్ట్రెట్లను అందజేసి వారిని సత్కరించినట్లు సమాచారం.
అభిమాన సంఘం బలం సోషల్ మీడియా వాదోపవాదాల్లో కాకుండా క్రమశిక్షణ, సేవా కార్యక్రమాలు, మంచి ప్రవర్తనలో కనిపించాలని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. అభిమానులు సమాజంలో గౌరవం సంపాదించేలా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, సినిమాల పరంగా ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ(Atlee)తో రూపొందుతున్న భారీ సినిమా రాకా(Raaka) షూటింగ్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్, ఆ సినిమా పూర్తయ్యాక డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)తో తన తర్వాతి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.








