మళ్లీ వైరలవుతున్న అనిరుధ్- కావ్య పెళ్లి వార్తలు.. ఈ సారి డేట్ తో సహా!
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sun Risers Hyderabad) కో ఓనర్ కావ్య మారన్(Kavya Maran) కు పెళ్లి జరగబోతోందంటూ మరోసారి సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. వీరిద్దరూ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారనే వార్తలు గతంలోనూ వైరల్ అయ్యాయి. తాజాగా వీరి పెళ్లి గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరగనుందని, నవంబర్ 10ని పెళ్లి డేట్ గా డిసైడ్ చేశారంటూ పలు కథనాలు వెలువడుతున్నాయి. దీంతో ఈ వార్తలు మరోసారి సినీ, క్రీడా వర్గాల్లో చర్చకు దారితీశాయి.
అయితే అనిరుధ్- కావ్య పెళ్లి గురించి వస్తున్న ఈ ప్రచారంపై ఇప్పటివరకు వారి నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడలేదు. గతంలోనూ ఇలాంటి వార్తలు బాగా ప్రచారంలోకి వచ్చిన సమయంలో అనిరుధ్ స్వయంగా రియాక్ట్ అయ్యారు. 2025 జూన్‌లో తన పెళ్లిపై వస్తున్న రూమర్లను ఖండిస్తూ, అవాస్తవ ప్రచారాన్ని ఆపాలని సోషల్ మీడియా వేదికగా కోరారు. అప్పట్లో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పలు సోషల్ మీడియా అకౌంట్స్ పోస్టులు చేయడంతో ఆయన స్పందించాల్సి వచ్చింది.
ఇక కావ్య మారన్ సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్(Kalanidhi Maran) కూతురు కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తన అనుబంధం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ఆమె తరచూ కనిపిస్తుండటంతో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. మరోవైపు అనిరుధ్ సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజా పెళ్లి వార్తలు నిజమా, లేక మరోసారి వైరల్ అవుతున్న రూమర్లేనా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.








