లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రారంభించిన ఆర్జివి
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఎప్పుడు ఏం చేస్తారో, ఏం ప్రకటిస్తారో ఊహించడం కాస్త కష్టమే. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కిస్తానని వర్మ తొలుత చెప్పారు. కానీ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి పేరుతో ఆ సినిమాను తీస్తానని కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ టైటిల్‌తో రూపొందించ నున్న ఈ చిత్రం లక్ష్మీపార్వతి దృష్టి కోణం నుంచి ఉంటుందని చెప్పారు. అయితే వర్మ ఏమాత్రం ముందస్తు సమాచారం లేకుండా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసేశారు. ఇందులో ఓ మహిళ గడప బయట చెప్పులు విడిచి, ఇంటిలోకి ప్రవేశిస్తూ కనిపించారు. లోపల మరో వ్యక్తి కాషాయ రంగు దుస్తులు ధరించి, కుర్చీలో కుర్చొని ఉన్నారు. బహుశా వర్మ సినిమాలో ఆమె లక్ష్మీపార్వతిగా, లోపల ఉన్న వ్యక్తి ఎన్టీఆర్‌లా కనిపిస్తారేమో చూడాలి.













