బాహుబలి -2 కు కావేరి సెగ
కావేరి జలవివాదం సందర్భంగా కన్నడిగులను అవమనించేలా వ్యాఖ్యానాలు చేసిన సినీ నటుడు సత్యరాజ్ (కట్టప్ప ఫేం) నటించిన బాహుబలి-2 సినిమా కర్ణాటకలో విడుదల కాకుండా అడ్డుకోవాలని కన్నడ సంఘాలు నిర్ణయించాయి. ఆయన తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండు చేస్తూ ఈనెల 28న బెంగళూరు బంద్ నిర్వహిస్తామని కన్నడ సంఘాల సమాఖ్య సంచాలకుడు వాటాళ్ నాగరాజు ప్రకటించారు. క్షమాపణ చెప్పకపోతే సత్యరాజ్ నటించిన చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు. 28న ఆ సినిమా విడుదల అవుతుందని ప్రకటించడంతో ఆందోళనకు శ్రీకారం చుడుతున్నట్లు వివరించారు. ఆ రోజు బెంగళూరు పురభవన్ నుంచి వేలాది మంది స్వతంత్ర ఉద్యానవనం వరకు భారీ ప్రదర్శన చేపడతామన్నారు. బాహుబలి సినిమా ప్రదర్శించే చిత్రమందిరాల వద్ద ధర్నాలు ప్రారంభిస్తామన్నారు.













