దసరా రిలీజ్ మిస్.. బాక్సాఫీస్ వద్ద ఆదర్శ కుటుంబం నిరాశ!
విక్టరీ వెంకటేష్(venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కాంబినేషన్లో వచ్చిన ఆదర్శ కుటుంబం(Aadarsha kutumbam) సినిమాపై రిలీజ్ కు ముందు మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ ఇద్దరి కలయికలో సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. అయితే ఈ సినిమాకు రిలీజ్ డేట్ విషయంలో సరైన ప్లానింగ్ లేకపోవడం ప్రతికూలంగా మారింది. దసరా పండుగ సందర్భంగా థియేటర్లలోకి వచ్చి ఉంటే సినిమాకు మరింత మెరుగైన ఓపెనింగ్స్ లభించేవని ట్రేడ్ వర్గాల అభిప్రాయం. వరుస వాయిదాలు, భారీ వర్షాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రమోషన్స్ లో ఆశించిన స్థాయి హడావుడి లేకపోవడం సినిమాపై ప్రభావం చూపించాయి. ఫలితంగా వెంకటేష్, త్రివిక్రమ్ కెరీర్లోనే అత్యంత తక్కువ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది.
సినిమాకు ప్రేక్షకుల నుంచి కొంతవరకు పాజిటివ్ రెస్పాన్స్ లభించినప్పటికీ, అది బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ కలెక్షన్లు గా మారలేదు. వీకెండ్లో కలెక్షన్లు కొంతమేర ఆశాజనకంగా కనిపించినా, సినిమా కమర్షియల్‌గా నిలదొక్కుకోవడానికి అవసరమైన స్థాయిలో వృద్ధి కనిపించలేదు. మంచి కాంబినేషన్, ఓ మోస్తరు టాక్ ఉన్నప్పటికీ కలెక్షన్ల పరంగా ఆశించిన ఫలితం దక్కలేదు.
ముఖ్యంగా దసరా వంటి కీలకమైన పండుగ సీజన్‌ను మిస్ చేసుకోవడం ఈ సినిమాకు పెద్ద లోటుగా మారింది. సెలవుల టైమ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చే అవకాశాన్ని చిత్రబృందం అందిపుచ్చుకోలేకపోయింది. సరైన టైమ్ లో రిలీజై ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఆదర్శ కుటుంబం విషయంలో కంటెంట్ కంటే రిలీజ్ టైమే పెద్ద ప్రతికూలంగా మారిందనే చెప్పాలి.







