పెళ్లిచూపులు బృందాన్ని అభినందించిన కవిత
రెండు జాతీయ ఫిల్మ్ అవార్డులను అందుకున్న పెళ్లిచూపులు సినిమా బృందాన్ని ఎంపీ కవిత అభినందించారు. ఈ మేరకు పెళ్లిచూపులు చిత్ర నిర్మాతలు యాష్రంగినేని, రాజ్ కందుకూరితో పాటు డైరెక్టర్ దాస్యం తరుణ్‌భాస్కర్, హీరో దేవరకొండ విజయ్, మాధవి, వర్థన్ దేవరకొండ, మ్యూజిక్ డైరెక్టర్ వివేక్‌సాగర్, అభయ్ తదితరులు ఎంపీ కవితను ఆమె నివాసంలో కలిశారు. 64వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే-డైలాగ్స్ కేటగిరీల్లో పెళ్లి చూపులు సినిమా రెండూ అవార్డులను గెలుచుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నుంచి అందుకున్న అవార్డులను వారు కవితకు చూపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబ కథాచిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని అన్నారు. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. మంచి సినిమాలు తీసేవారికి తెలంగాణ ప్రభుత్వం సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆమె తెలిపారు.













