నానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మెగాస్టార్
యువ కథానాయకుడు నానికి ఇచ్చిన మాటను మెగాస్టార్ చిరంజీవి నిలబెట్టుకున్నారు. చిరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ టెలివిజన్ షోకు ఇటీవల నాని ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి విషయాలను నాని పంచుకున్నారు. తన చిన్నప్పుడు చిరంజీవి మాస్టర్ సినిమాకు సైకిల్ వేసుకెళ్తే దానిని ఎవరో దొంగిలించారని, అయితే చిరు సినిమాకు టికెట్ దొరికిన ఆనందంలో సైకిల్ పోయిందన్న బాధ కూడా తనకు కలగలేదని చెప్పారు. షోలో గెలుచుకున్న దానిలో కొంత సొమ్ముతో ఆ సైకిల్ కొనుక్కుంటానని నాని అనగా, అందుకు చిరంజీవి వద్దని చెప్పారు. తన సినిమాకు వచ్చినందుకు సైకిల్ పోయింది కాబట్టి, తానే కొత్త సైకిల్ కొనిపెడతానని హామీ ఇచ్చారు. ఆ మేరకు నానికి చిరంజీవి సైకిల్ పంపారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా చెబుతూ ఆ బాలుడు సైకిల్‌ను తిరిగి దక్కించుకున్నాడు. షోలో చేసిన ప్రామిస్ మేరకు చిరంజీవిగారు ఈ కూల్ సైకిల్ పంపారు అని దాని పక్కన నిలబడి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.













