మూకుతి అమ్మన్2తో నయనతారకు మరో ఎదురుదెబ్బ!
సౌత్ సినీ ఇండస్ట్రీలో భారీ రెమ్యూనరేషన్ అందుకునే హీరోయిన్లలో నయనతార(nayanthara) ఒకరు. భారీ రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్లకు దూరంగా ఉండే తనదైన శైలితో ఆమె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆమె కెరీర్ ఆశించిన స్థాయిలో సాగడం లేదు. షారుఖ్ ఖాన్(Shah rukh khan)తో చేసిన జవాన్(Jawaan), చిరంజీవి(Chiranjeevi) సరసన నటించిన మన శంకర వరప్రసాద్ గారు మినహా మిగిలిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ముఖ్యంగా మహిళా ప్రాధాన్యత కలిగిన కథలతో ఆడియన్స్ ను ఆకట్టుకోవాలన్న ఆమె ప్రయత్నాలు వరుసగా విఫలమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఎంతో నమ్మకం పెట్టుకున్న మూకుతి అమ్మన్2(mookuthi amman2) కూడా నయనతారకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. సుందర్.సి(Sundar. C) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి సందర్భంగా తమిళం, తెలుగులో భారీగా రిలీజైంది. అయితే రిలీజ్‌కు ముందు ఉన్న అంచనాలు బాక్సాఫీస్ వద్ద కనిపించలేదు. ఫస్ట్ డే నుంచే కలెక్షన్లు వీక్ గా ఉండటంతో సినిమా భారీ నష్టాల దిశగా పయనిస్తోంది. పెట్టుబడిలో కనీసం పది శాతం కూడా థియేట్రికల్ కలెక్షన్ల రూపంలో రాబట్టలేకపోవడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇక ఈ ఫ్లాపుల ప్రభావం నయనతార నెక్ట్స్ ప్రాజెక్టులపై ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్(Salman Khan) హీరోగా వంశీ పైడిపల్లి(Vamshi Paidipally) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఆమె నటిస్తున్నారు. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు రజనీకాంత్(rajinikanth) నటిస్తున్న ధర్మన్(Dharman) లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు భారీ ప్రాజెక్టులపైనే ఇప్పుడు నయనతార ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.







