ప్రియాంక ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్!
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇండియన్ సినిమాల్లోకి తిరిగి వస్తున్నప్పటికీ, నటిగా మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కొన్నేళ్లుగా బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటూ ఇంటర్నేషనల్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె.. ఎట్టకేలకు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమాతో ఇండియన్ ఆడియన్స్ ముందుకు రానున్నారు. ఈ సినిమా తప్ప మరో ఇండియన్ సినిమాకు ఆమె ఇప్పటివరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే తాజాగా ప్రియాంక తీసుకున్న ఓ డెసిషన్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. 2016లో రిలీజైన మరాఠీ సినిమా వెంటిలేటర్ కు సీక్వెల్ అనౌన్స్ చేసి తన నిర్మాణ సంస్థను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు.
వెంటిలేటర్ 2తో ప్రియాంక చోప్రా తన నిర్మాణ ప్రయాణాన్ని మరోసారి కొనసాగించనున్నారు. పర్పుల్ పెబుల్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆమెతో పాటు తల్లి డాక్టర్ మధు చోప్రా, డైరెక్టర్ రాజేష్ మాపుస్కర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించిన రాజేష్ మాపుస్కరే ఈ సీక్వెల్‌కు కథ అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. మ్యాజిక్ పిక్చర్స్ భాగస్వామ్యంతో రూపొందనున్న ఈ సినిమాను 2027లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ఈ అనౌన్స్‌మెంట్‌ను ప్రియాంక నటిగా మరో ఇండియన్ సినిమాకు ఒప్పుకున్నట్టుగా చూడలేం. ది స్కై ఈజ్ పింక్ తర్వాత 2019 నుంచి ఆమె ఇండియన్ థియేట్రికల్ సినిమాల్లో నటించలేదు. బాలీవుడ్లో తనకు లభిస్తున్న అవకాశాలు లిమిటెడ్‌గా ఉన్నాయనే అభిప్రాయాన్ని గతంలో వ్యక్తం చేసిన ఆమె అంతర్జాతీయ సినిమాలు, వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టారు. ఇప్పుడు వారణాసితో నటిగా, వెంటిలేటర్2 తో నిర్మాతగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తన ఉనికిని చాటుకునేందుకు రెడీ అవుతున్నారు.







