జో బైడెన్ ఆరోగ్యం పై మరో విషయం వెలుగులోకి… స్పందించిన వైట్‌హౌస్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్యంపై ఇప్పటికే పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ విషయం మరో వివాదానికి తెర తీసింది. అమెరికాలో పార్కిన్సన్స్ స్పెషలిస్ట్‌గా పేరుగాంచిన ఓ వైద్యుడు ఈ ఏడాది బైడెన్ వ్యక్తిగత డాక్టర్‌ను కలిసినట్లు శ్వేతసౌధం లాగ్ బుక్ ద్వారా తెలిసింది. దీంతో అధ్యక్షుడు పార్కిన్సన్స్ చికిత్స తీసుకుంటున్నారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిని వైట్‌హౌస్ ఖండించింది. బైడెన్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, ఏ చికిత్సా తీసుకోవడం లేదని అధికార ప్రతినిధి కరీన్ జీన్ పియర్ వెల్లడించారు. సాధారణ చెకప్‌లో భాగంగానే ఓ న్యూరాలజిస్ట్ వైట్‌హౌస్‌కు వచ్చారని ధ్రువీకరించారు. ఆయనెవరు, ఎందుకు వచ్చారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. భద్రతా కారణాలరీత్యా అలాంటి వివరాలు బహిర్గతం చేయడం సరికాదని నొక్కిచెప్పారు. ఈ సమయంలో విలేకరులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ, ఆయా వ్యక్తుల గోప్యత, భద్రతరీత్యా, వాటిని వెల్లడిరచడం కుదరదని తేల్చి చెప్పారు.






