US Congress :డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని ధ్రువీకరించిన అమెరికా కాంగ్రెస్
అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎన్నికను అమెరికా కాంగ్రెస్ (US Congress) లాంఛనంగా ధ్రువీకరించింది. నాలుగేళ్ల క్రితం ఎన్నికల్లో ట్రంప్ తన ఓటమిని అంగీకరించకపోవడంతో ఇలాంటి సమావేశం తీవ్ర ఉద్రికత్తకు, హింసాత్మక ఘటనలను తావిచ్చిన సంగతి తెలిసిందే. దానిని దృష్టిలో పెట్టుకుని ఈసారి కట్టుదిట్టమైన భద్రత (Security )ఏర్పాటు చేశారు. బహుళ అంచెల్లో పొడవైన కంచెలతో చేసిన పటిష్ఠ బందోబస్తు నడుమ సమావేశాలు మొదలయ్యాయి. హింస, నిరసనలు కాదు కదా సాధారణ అభ్యంతరాలకు కూడా ఆస్కారం లేకుండా జాగ్త్రతలు తీసుకున్నారు. దీంతో ధ్రువీకరణ చాలా చాఫీగా అరగంటలోపు పూర్తయింది. గొప్ప ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని కాంగ్రెస్ ధ్రువీకరించడం చరిత్రలో పెద్ద పరిణామమని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్‌పై పోటీచేసి ఓడిపోయిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్(Kamala Harris) ఆయన విజాయన్ని ధ్రువీకరించే లాంఛనప్రాయ క్రతువుకు అధ్యక్షత వహించారు. అధికార బదలాయింపు శాంతియుతంగా జరిగేలా చూడడం తన పవిత్ర కర్తవ్యమని ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం ఎంతటి సున్నితమైనదో చూస్తున్నామని, అధికార మార్పిడి సాఫీగా పూర్తయ్యేందుకు అందరూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తమ ఓటమిని అంగీకరించడానికి నిర్వహించే సమావేశానికి తామే అధ్యక్షత వహించాల్సి వచ్చిన కొద్ది మంది ఉపాధ్యక్షుల్లో ఆమె ఒకరు. 1960లో జాన్ ఎఫ్.కెన్నడీ అమెరికా అధ్యక్షుడిగా నెగ్గారు. ఆయనపై ఓడిపోయిన రిచర్డ్ నిక్సన్ ఇలాంటి సమావేశానికి అధ్యక్షత వహించారు. 2020 సంవత్సరంలో అల్ గోర్ ఇలాగే చేశారు.






