సిక్కు తలపాగాల జప్తుపై… అమెరికా విచారణ
మెక్సికన్ సరిహద్దు వెంబడి నిర్బంధంలోకి తీసుకొన్న దాదాపు 50 మంది సిక్కు వలసదారుల తలపాగాలను జప్తు చేశారన్న ఫిర్యాదులపై అమెరికా అధికారులు విచారణ ప్రారంభించారు. సరిహద్దు గస్తీ దళాలు ఇటీవల ఈ చర్యకు పాల్పడినట్లు మానవహక్కుల కార్యకర్తలు వెలుగులోకి తీసుకురాగా, ఆ మేర కథనాలు కూడా వెలువడ్డాయి. సిక్కు మత ధర్మం ప్రకారం పురుషులు తలపాగా ధరించాలి. కేశ ఖండన చేయించరాదు. ఈ ఘటనపై కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) కమిషనర్ క్రిస్ మ్యాగ్నస్ మాట్లాడుతూ పై విషయాన్ని చాలా తీవ్రమైనదిగా తాము పరిగణించి, అంతర్గత దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.






