66 లక్షల కోట్ల కోవిడ్ ప్యాకేజీకి అమెరికా ఆమోదం
అగ్రరాజ్యం అమెరికా కోవిడ్ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. 900 బిలియన్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి అమెరికా ఉభయ సభలు ఓకే చెప్పేశాయి. అంటే సుమారు 66 లక్షల కోట్ల నిధిని ఖర్చు చేయనున్నారు. చాన్నాళ్ల పాటు ఈ ప్యాకేజీపై ఉభయసభల్లో చర్చ జరిగింది. చివరికు సేనేట్‌లో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు ఆమోదం దక్కింది. కోవిడ్ ప్యాకేజీ కింది అనేక మంది అమెరికన్లకు నేరుగా ఖాతాల్లోకి నగదు జమా చేయనున్నారు. కనీసం ఒక్కొక్కరికి 600 డాలర్లు ఇవ్వనున్నారు. వ్యాపారవేత్తలకు, నిరుద్యోగులకు కూడా ఈ స్కీమ్ కింద లబ్ధి చేకూరనున్నది. అయితే ఈ ప్యాకేజీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో సంతకం చేయనున్నారు. ఆ తర్వాత ఈ బిల్లు చట్టంగా మారుతుంది.
కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కూడా బిల్లును స్వాగతించారు. కొత్త ఏడాదిలో ఈ సహాయ ప్రణాళికను అమలు చేసే విధానాలను రూపొందించనున్నట్లు బైడెన్ తెలిపారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో 359-53, సేనేట్‌లో 92-6 తేడాతో బిల్లు పాసైంది. వచ్చే వారం రోజుల్లో అమెరికన్ల ఖాతాల్లోకి నేరుగా నగదు వెళ్తుందని ట్రెజరీ శాఖ మంత్రి స్టీవెన్ ముచిన్ తెలిపారు.






