అమెరికా కీలక నిర్ణయం.. తక్షణమే ఈ అంక్షలు అమల్లోకి
అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల డీప్‌ఫేక్ కలకలం సృష్టించింది. ఏకంగా అధ్యక్షుడు జో బైడెన్ వాయిస్‌ను అనుకరించేలా కొందరు మోసగాళ్లు ఏఐ-ఆధారిత ఫోన్‌కాల్స్ ను సృష్టించి తప్పుడు ప్రచారానికి తెర తీశారు. దీంతో అప్రమత్తమైన అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ-ఆధారిత వాయిస్ రోబోకాల్స్‌పై నిషేధం విధించింది. ఈ మేరకు ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషనన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. కొంతమంది నేరగాళ్లు కృత్రిమమేధ సాంకేతికతను ఉపయోగించి నకిలీ వాయిస్ రోబోకాల్స్‌ను సృష్టిస్తున్నారు. వాటితో ప్రముఖుల కుటుంబాలను బెదిరించడం, సెలబ్రిటీలను ఇమిటేట్ చేసి తప్పుడు సమాచార వ్యాప్తికి పాల్పడుతున్నారు.
గతంలో ఇలాంటి ఆడియో, వీడియో కాల్స్‌ను సృష్టించినా ఇప్పుడు ఉన్న అధునాతన సాంకేతికతతో ఈ నకిలీలను గుర్తించడం కష్టంగా మారింది. ప్రస్తుత ఎన్నికల సీజన్లో ఇలాంటి ఫేక్ రోబోకాల్స్ కొత్త ముప్పును తెచ్చిపెడుతున్నాయి అని ఎఫ్‌సీసీ కమిషనర్ జియోఫ్రే స్టార్క్స్ తెలిపారు. అందుకే ఇలాంటి ఏఐ అధారిత రోబోకాల్స్‌పై నిషేధం విధిస్తున్నామని, తక్షణమే ఈ అంక్షలు అమల్లోకి వస్తాయని వెల్లడిరచారు. కంపెనీలు వీటిని సృష్టించినా, ప్రసారం చేసిన భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు.






