నేను గెలిస్తే వారందరూ జైలుకే : ట్రంప్
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్గా మారింది. ఎన్నికల సమయంలో అవినీతికి పాల్పడే వారిని ఉద్దేశిస్తూ ఈ పోస్టు చేశారు. తాను అధికార పీఠమెక్కాక అవినీతిపరులందరినీ జైలుకు పంపిస్తానని హెచ్చరించారు. తమ ప్రభుత్వం వారికి కఠిన జైలు శిక్ష అమలు చేస్తుందని పేర్కొన్నారు. దయచేసి జాగ్రత వహించండి. అధ్యక్ష ఎన్నికల్లో నేను గెలిస్తే, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ఓటింగ్లో అనైతిక చర్యలకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదు. న్యాయవాదులు, రాజకీయ నాయకులు, దాతలు, అక్రమ ఓటర్లు, అధికారులు అందరికీ అదే వర్తిస్తుంది. పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ఓటింగ్లో అవినీతికి పాల్పడినట్లు తేలితే మునుపెన్నడూ చూడని విధంగా చర్యలుంటాయి. దీర్ఘకాల జైలు శిక్షలుంటాయి. తద్వారా న్యాయ దుర్వినియోగం మళ్లీ జరగదు అని ట్రంప్ హెచ్చరించారు.






