జో బైడెన్ కు అభిశంసన ముప్పు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై అభిశంసన విచారణకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రోత్సాహంతో రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులంతా ఏకగ్రీవంగా బైడెన్ అభిశంసన విచారణకు అనుకూలంగా ఓటు వేశారు. కుటుంబ సభ్యుల వ్యాపారాల విషయంలో బైడెన్ అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు బయటపడలేదు. అయినప్పటికీ రిపబ్లికన్ పార్టీ ప్రజాప్రతినిధులు బైడెన్‌పై అభిశంసన విచారణకు అంగీకారం తెలిపారు. సెనేట్ విచారణలో బైడెన్ దోషిగా తేలితే ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించవచ్చు. ఇందుకు సుదీర్ఘ సమయం పడుతుంది. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్న బైడెన్‌కు ఇది ఇబ్బందికరమేనని భావిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ పదవిలో ఉండగా రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్నారు.






