Washington: ట్రంప్ డీపొర్టేషన్ విధానం కరెక్ట్.. మా వాళ్లను తీసుకెళ్లేందుకు సిద్ధమన్న ప్రధాని మోడీ..

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో కీలక చర్చలు జరిపారు. తర్వాత సంయుక్త మీడియా సమావేశంలో కీలక అంశాలు వెల్లడించారు ట్రంప్, మోడీ. ఈ సందర్భంగా అక్రమ వలసదారుల అంశంపై ప్రధాని మోడీ (PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని, ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందని పేర్కొన్నారు.
అమెరికా (USA)లో అక్రమంగా నివసిస్తున్న 104 మంది భారతీయులను ఇటీవల అగ్రరాజ్యం తిప్పి పంపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వాళ్ల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేయడం వివాదాస్పదమైంది. ఈ పరిణామాల వేళ ట్రంప్‌తో భేటీ అయిన మోడీ వలసదారుల అంశంపైనా చర్చించారు. ‘‘యువత, పేదరికంలో ఉన్నవారు మోసపూరితంగా వలసదారులు (Illegal Migrants)గా మారుతున్నారు. డబ్బు, ఉద్యోగాల ఆశజూపి కొంతమంది వీరిని మోసం చేస్తున్నారు. అలా వారు అక్రమ వలసదారులుగా మారుతున్నారు. వారికి తెలియకుండానే మానవ అక్రమరవాణా కూపంలోకి వెళ్తున్నారు. ఈ దారుణాలను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నాల్లో భారత్‌కు ట్రంప్ పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం’’ అని మోడీ వెల్లడించారు.
ఎందుకంటే.. బయటకు చెప్పినా, చెప్పకున్నా చాలా మందిని భారత్ సహా పలుదేశాలు డిపోర్టేషన్ చేస్తున్నాయి. ముఖ్యంగా భారత్ కు బంగ్లాదేశ్ నుంచి లక్షలాది మంది అక్రమంగా వలసవచ్చి స్థిరపడుతున్నారు. వీరి నుంచి అసోం సహా పలు రాష్ట్రాల్లో ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇక మయన్మార్ లోని రోహింగ్యాల సమస్య భారత్ ను ఇబ్బంది పెడుతోంది. అక్కడి సైన్యం వారిపై దాడులకు దిగుతుండడంతో.. వారు బతుకు తెరువుకోసం భారత్ వచ్చి, ఇక్కడ ఫేక్ సర్టిఫికెట్లతో స్థిరపడుున్నారు. వారికి స్థానిక నేతలు మద్దతుగా ఉండడం.. ఇతర వర్గాలకు సమస్యాత్మకంగా పరిణమిస్తోంది.
ఇప్పుడు ట్రంప్ చర్యను వ్యతిరేకిస్తే.. భవిష్యత్ లో ఇది భారత్ కు గుదిబండలా మారనుంది. అంతేకాదు.. ట్రంప్ తో కలిసి ప్రయాణించాల్సిన అవసరం భారత్ కు ఎంతైనా ఉంది. దీంతో గతంతో పోలిస్తే ఇరుదేశాల మధ్య బంధం మరింత బలోపేతం కావాల్సి ఉంది. ఈ దిశగానే మోడీ అడుగులు వేస్తున్నారు. అవతల ట్రంప్ కు భారత మార్కెట్ అవసరం ఉంది. చైనాను ఎదుర్కొనేందుకు భారత్ తో సాన్నిహిత్యం తప్పనిసరి అని చెప్పాలి. దీంతో ఇరుదేశాలు స్నేహగీతం ఆలపిస్తున్నాయి.