అమెరికా మా బద్ద శత్రువు.. అధ్యక్షుడు మారితే మా విధానాలు మారవు
అమెరికా మాకు బద్ద శత్రువు. అక్కడ అధ్యక్షుడు మారినంత మాత్రానా మా విధానాలు మారవు. మార్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఇవీ అమెరికా పట్ల ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తాజా వ్యాఖ్యలు. అమెరికాలో అధ్యక్షుడి అధికారాల బదలాయింపు శాంతియుతంగా జరుగాలని, ప్రజాస్వామ్యబద్ధంగా జో బైడెన్ అధ్యక్షుడిగా ప్రమాణం చేయడం జరుగాలని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో కోరుకుంటున్నాయి. అయితే, ఇవేమీ ఉత్తర కొరియాకు పట్టడం లేదు. బైడెన్ గెలిచినా, ట్రంప్ ఓడినా అమెరికా పట్ల తమ వైఖరిలో ఏమాత్రం మార్పు ఉండదని, వారు మారినంతం మాత్రానా మేం మా విధానాలు మార్చుకోం అని ఖరాకండిగా చెప్తున్నారు కిమ్.
తాజాగా ఉత్తర కొరియా నియంత అధినేత కిమ్ జోంగ్ కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటన.. అమెరికా తమ బద్ధశత్రువని మరోసారి సృష్టం చేశారు. అమెరికాలో ఆందోళనల మధ్య బైడెన్ ప్రమాణం స్వీకరిస్తున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడం చాలా కష్టమని కిమ్ ప్రభుత్వం తమ విధానాన్ని ప్రకటనలో సృష్టంగా పేర్కొన్నది. డొనాల్డ్ ట్రంప్ కాలంలో కిమ్ జోంగ్ ఉన్ ఆయను మూడుసార్లు కలిశారు. అయితే ఇరు దేశాల మధ్య సంబంధాలలో ఎటువంటి మెరుగుదల కనిపించలేదు. కిమ్ అనేకసార్లు అమెరికాను బెదిరించాడు. ఉత్తర కొరియా యొక్క ఏ చర్య అయినా దాని ఉనికిని అంతం చేయగలదని ట్రంప్ కూడా పేర్కొన్నారు.
అయితే అమెరికా బెదిరింపులకు తలొగ్గని ట్రంప్ తన పనులు తాను చేసుకుంటూ పోయారు. పలుమార్లు అధునిక ఆయుధాలను పరీక్షించి తమకేం భయం లేదనే సంకేతాలిచ్చారు. ప్రస్తుతం ట్రంప్ దిగిపోయి బైడెన్ అధ్యక్ష పీఠంపై కూర్చుంటున్న సమయంలో మరోసారి తమ బెదిరింపు ధోరణిని ప్రదర్శించాడు. అమెరికాయే మేం అభివృద్ధి చెందడానికి ప్రేరణ కలిగించింది. వారి కారణంగానే మేం మా బలాన్ని పెంచుకున్నాం. అందువల్ల అమెరికానే మాకు అతిపెద్ద శత్రువు అని ఉత్తర కొరియా ప్రకటనలో పేర్కొన్నది.






