వివేక్ రామస్వామిని బెదిరించిన వ్యక్తి అరెస్ట్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం పోటీపడుతున్న భారత సంతతి అభ్యర్థి వివేక్ రామస్వామి తలను పేల్చేస్తానని బెదిరించిన వ్యక్తిని అరెస్టు చేసి కేసు పెట్టారు. నిందితుడి పేరు టైలర్ యాండర్సన్ అని, అతడిని అరెస్ట్ చేశారని న్యూ హ్యాంప్ షైర్ అటార్నీ కార్యాలయం తెలిపింది. పోర్టస్ మత్ నగరంలో జరిగే ప్రచార సభకు రావలసిందిగా కోరుతూ రామస్వామి బృందం యాండర్సన్తో సహా పలువురు ఓటర్లకు సందేశం పంపింది. దానికి యాండర్సన్ భేష్ అతడి తలను పేల్చేయడానికి మరో అవకాశం దొరికిందన్నమాట అని ప్రత్యుత్తరమిచ్చాడు. అతడి సభకు వచ్చేవారందరినీ హతమారుస్తాననీ బెదిరించాడు. యాండర్సన్పై ఆరోపణలు నిరూపితమైతే అయిదేళ్ల జైలు శిక్ష పడుతుంది. విడుదలయ్యాక మూడేళ్లపాటు అతడిపై నిఘా ఉంటుంది. 2,50,000 డాలర్ల జరిమానా కూడా విధిస్తారు.






