జో బైడెన్ కీలక నిర్ణయం… భారత రాయబారిగా

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‍తో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఓ ప్రముఖ వ్యక్తికి భారత్‍లో అమెరికా రాయబారి పదవిని కట్టబెట్టేందుకు సిద్ధం అయ్యారు. భారత్‍లో అమెరికా రాయబారి పదవికి లాస్ ఏంజెల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టిని నామినేట్ చేయనున్నారని ఆ దేశానికి చెందిన ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. బైడెన్ తన నిర్ణయాన్ని వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉందని తెలిపింది.
జనవరి 20 నుంచి భారత్‍లో అమెరికా రాయబారి పదవి ఖాళీగా ఉంది. తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎరిక్ గార్సెట్టి కీలకంగా వ్యవహరించారు. బైడెన్ క్యాంపెయిన్‍కు కో చైర్‍గా పని చేశారు. ప్రస్తుతం ఈయన అగ్రరాజ్యం అమెరికాలోనే రెండో అతిపెద్ద నగరమైన లాస్ ఏంజెల్స్ నగరానికి మేయర్‍గా ఉన్నారు. నిజానికి ఆయనకు బైడెన్ ప్రభుత్వంలో కీలక పదవి లభిస్తుందని అనుకున్నారు. కానీ ఎందువల్లనో కుదరలేదు. అందుకే ఆయనకు కీలకమైన భారత రాయబారి పదవిలో నియమించాలని బైడెన్ నిర్ణయించారు. భారత్‍తోపాటు జపాన్, ఇజ్రాయెల్, చైనా దేశాలకు కూడా బైడెన్ రాయబారులను నియమించే అవకాశం ఉంది.