అమెరికా అధ్యక్ష రేసులో కమలా హారిస్‌దే.. పై చేయి
అమెరికా అధ్యక్ష రేసులో డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌దే పైచేయిగా ఉందని తాజాగా వెల్లడైంది. డెసిషన్ డెస్క్ హెచ్‌క్యూ` ది హిల్ కూర్చిన పోల్ ఆఫ్ ది పోల్స్‌లో దేశవ్యాప్తంగా డొనాల్డ్ ట్రంప్ కంటే హారిస్ 4.2 శాతం అధిక్యంలో ఉన్నారు. 45 పోల్స్‌ను క్రోడీకరించి ఫలితాలను వెల్లడించారు. కమలా హారిస్ ఏకంగా 4.2 శాతం ఆధిక్యంలో ఉండగా, మే తర్వాత ఆమె ఏకంగా పది శాతం పుంజుకోవడం విశేషం. హోరాహోరీ పోరు నెలకొన్న ఏడు రాష్ట్రాల్లో ఆరింటిలో ట్రంప్‌పై హారిస్ ఒకశాతం అధిక్యంలో ఉన్నారని సర్వే వెల్లడించింది.
హోరాహోరీ రాష్ట్రాలైన జార్జియా, మిషిగాన్, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్. అరిజోనాల్లో హారిస్‌కు ఒక శాతం ఆధిక్యం ఉంది. నెవాడలో మాత్రం ట్రంప్ ముందంజలో ఉన్నారు. నెవెడాలోనూ హారిస్ క్రమేపీ పుంజుకుంటున్నారు. మే నుంచి తీసుకుంటే ట్రంప్‌తో వ్యత్యాసాన్ని ఆరు పాయింట్ల మేరకు తగ్గించారు. ట్రంప్‌తో పోలిస్తే కమలా హారిస్ నిజాయితీ, క్రమశిక్షణ కలిగిన నాయకురాలని అమెరికన్లు భావిస్తున్నట్లు సర్వే తెలిపింది. ఆర్థిక వ్యవస్థ, వలసల అంశాల్లో ట్రంప్ మెరుగని భావిస్తున్నారు. అధ్యక్ష రేసులోకి లేటుగా వచ్చినా హారిస్ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10న ట్రంప్‌తో ఆమె డిబేట్ పోటాపోటీగా ఉంటుందని భావిస్తున్నారు. అందరి దృష్టీ దానిపైనే నెలకొంది.






