డొనాల్డ్ ట్రంప్‌ను వెనక్కి నెట్టిన కమలా హారిస్!
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ 5న జరుగనున్నాయి. రిపబ్లిక్ పార్టీ తరపున మరోసారి డొనాల్డ్ ట్రంప్ బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో డెమొక్రాట్ అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. కమలా హారిస్ బరిలో నిలుస్తుండడంతో ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. తాజాగా ఓ సర్వే కీలక రిపోర్ట్ విడుదల చేసింది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కంటే కమలా హారిస్‌కే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది.
తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో డొనాల్డ్ ట్రంప్‌కు 42 శాతం మంది మద్దతు తెలుపగా, కమలా హారిస్‌కు 44 శాతం మంది అండగా నిలిచారు. దాంతో డెమోక్రటిక్ అభ్యర్థిత్వానికి అవసరమైన మద్దతను కూడగుడుతున్న సమయంలో సర్వేలో ఉపాధ్యక్షురాలికి అనుకూలంగా సర్వే ఫలితం వచ్చింది. ఇంతకు ముందు ఈ నెల 15-16 మధ్య జరిగిన సర్వేలో ట్రంప్ 44 శాతం, జులై 1-2 మధ్య జరిగిన సర్వేలో డొనాల్డ్ ట్రంప్ ఒక శాతం పాయింట్లతో ముందంజలో నిలిచారు. ప్రస్తుతం కమలా హారిస్ మద్దతు పెరుగుతోందని జాతీయ సర్వేలు చెబుతున్నాయి.






