ట్రంప్ అధ్యక్షుడైతే తీవ్ర పరిణామాలు : కమలా హారిస్
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడైతే ప్రజలు అత్యంత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ హెచ్చరించారు. 2020లో ట్రంప్ మద్దతుదారులు అధ్యక్ష భవనంపై చేసిన దాడిని గుర్తు చేశారు. భారత్, ఆఫ్రికా మూలాలున్న కమలా హారిస్ డెమొక్రటిక్ పార్టీ తరపున దేశ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు. ఈ సందర్భంగా షికాగోలోని డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు. ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
అలాగే, తాను అధ్యక్షురాలిగా ఎన్నికైతే అమెరికాను అగ్రరాజ్యంగా నిలబెట్టేందుకు ఏం చేస్తాననే అంశాలను వెల్లడించారు. విభజన, వివక్ష, విద్వేషం వంటి సమస్యలను అధిగమించేందుకు నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికలు ప్రజలకు గొప్ప అవకాశమని పిలుపునిచ్చారు. తాను దేశ అధ్యక్షురాలినైతే అంతరిక్షం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో దేశాన్ని ప్రపంచానికే అగ్రగామిగా చేస్తానని తెలిపారు. చైనాను వెనక్కునెట్టి అమెరికాను 21వ శతాబ్ధానికే అగ్రరాజ్యంగా నిలబెడతానని తెలిపారు. అలాగే ఇజ్రాయెల్, ఉక్రెయిన్ తోపాటు నాటోకు అండగా ఉంటామని ప్రకటించారు.






