కమలా హారిస్ కు తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొద్ది సమయం పాటు తన అధ్యక్ష బాధ్యతలను ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు అప్పగించారు. ఈ అరుదైన ఘటన తాజాగా చోటు చేసుకుంది. జో బైడెన్ రేపు 79వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన హెల్త్ చెకప్ చేయించుకున్నారు. చెకప్‌లో భాగంగా బైడెన్‌కు వైద్యులు కొలనోస్కోపీ కూడా నిర్వహించారు. కొలనోస్కోపీ సందర్భంగా బైడెన్ కు మత్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంత పూర్తయ్యేసరికి కొంత సమయం పడుతుంది. అందుకే వైద్య పరీక్షలకు వెళ్లేముందు బైడెన్ తన బాధ్యతలను ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు అప్పగించారు. ఆ విధంగా కమలా హారిస్ కాసేపు అగ్రరాజ్యానికి ఇన్చార్జి అధ్యక్షురాలిగా వ్యవహరించారు. బైడెన్ వైద్య పరీక్షలు చేయించుకుంటున్న సమయంలో కమలా హారిస్ వైట్‌హౌస్ లోని వెస్ట్ వింగ్ లో ఉన్న తన కార్యాలయం నుంచి విధులు నిర్వర్తించారని మీడియా కార్యదర్శి జెన్ సాకీ తెలిపారు.






