‘కరోనా కట్టడిలో మీ పాత్ర అమోఘం’ వివేక్ మూర్తికి కమలా హారిస్ అభినందన
వాషింగ్టన్ః దేశంలో కరోనా వైరస్‌ను అదుపు చేయడానికి అవిరళ, అవిశ్రాంత కృషి చేశారంటూ సర్జన్ జనరల్ వివేక్ మూర్తిపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ సర్జన్ జనరల్ మూర్తీ! మీకు మా హృదయపూర్వక అభినందనలు. కరోనాను కట్టడి చేయడం కోసం మీరు నెలల తరబడి అహర్నిశలూ శ్రమ పడుతున్నారని మాకు తెలుసు” అని ఆమె కరోనాపై ఏర్పాటు చేసిన ఒక అవగాహన కార్యక్రమంలో పేర్కొన్నారు.
‘‘మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు, మీ సహచరులు, ఈ దేశ ప్రజలందరి ముందూ మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందించాలని భావించాను. ఈ దేశాన్ని కరోనా వైరస్ నుంచి విముక్తం చేయాలని మీరు కంకణం కట్టుకున్నారు. సైన్స్‌పరంగా మీరు ఈ దేశానికి తిరుగులేని సేవ చేస్తున్నారు. సమష్టి కృషితో మనం ఏదైనా సాధించగలమని మీరు నిరూపించారు” అని కమలా హారిస్ అన్నారు.
గత వారం వైట్‌హౌస్ సర్జన్ జనరల్‌గా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ వివేక్ మూర్తి ఈ సమావేశంలో కమలా హారిస్‌ను సభికులకు పరిచయం చేశారు. ‘‘దేశంలోని అతి ముఖ్యమైన, అతి గౌరవనీయమైన నాయకుల్లో కమలా హారిస్ ఒకరు. కుల, మత, వర్ణ వివక్ష లేకుండా దేశంలోని అన్ని వర్గాలను అభ్యున్నతి వైపు నడిపించడానికి నిస్వార్థంగా కృషి చేస్తున్న వ్యక్తి కమలా హారిస్. ఆమె పైకి ఎంత కఠినంగా, శక్తిమంతురాలిగా కనిపిస్తారో లోపల అంత దయా స్వభావి. ఆమెలో సేవ, అంకిత భావం అధికం. ఆమె లక్షలాది మందికి స్ఫూర్తిదాయకం” అని వివేక్ మూర్తి అభివర్ణించారు.
‘‘దేశంలోని ప్రతి వ్యక్తీ ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలని నేను మనసారా కోరుకుంటాను. ప్రతి వ్యక్తీ ఆరోగ్యంగా ఉండేలా చూడడం సర్జన్ జనరల్‌గా నా కనీస బాధ్యత. ముఖ్యంగా కరోనా సమయంలో ఇది నా పవిత్ర కర్తవ్యం. ఇటువంటి పరీక్షా సమయం శతాబ్దానికి ఒకసారి గానీ రాదు” అని ఆయన అన్నారు. ‘‘ఈ వైరస్ వల్ల ఏడాదికి పైగా లక్షలాది మంది అమెరికన్లు పడరాని పాట్లు పడుతున్నారు. ఎన్నో కుటుంబాలు చితికిపోయాయి. తలచుకుంటే గుండె చలించిపోతుంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘నేనే నా కుటుంబంలో ఏడుగురిని కోల్పోయాను. ఈ ఏడాది ప్రారంభంలో మా మావయ్య కరోనా వల్ల కన్నుమూశారు. ఇలా కుటుంబ సభ్యులు మరణించడం, ప్రాణ స్నేహితులు ప్రాణాలు కోల్పోవడం వంటివి మనల్ని ఎంతగానో బాధిస్తాయి. కుటుంబంలో ఎందరో వృద్ధులు మన కళ్ల ముందే రాలిపోయారు. దేశానికి సేవ చేస్తున్న, దేశ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న ఎందరో వ్యక్తులు నిస్సహాయ స్థితిలో మరణించారు” అని ఆయన పేర్కొన్నారు.
వివక్షలపై ఉక్కుపాదం
కాగా, కమలా హారిస్ తన ప్రసంగంలో వివక్షలు, అసమానతల గురించి కూడా విస్త•తంగా మాట్లాడారు. ‘‘ఈ సమస్యకు అధ్యక్షుడు జో బైడెన్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. మనం ఆయనకు ఒక్క విషయం తప్పనిసరిగా చెప్పాల్సి ఉంది. దేశంలోని అన్ని వ్యవస్థలలోకి ఈ వివక్షలు, అసమానతలు చొరబడ్డాయి. చివరికి ఆరోగ్య వ్యవస్థలో కూడా ఈ వివక్షలు ప్రవేశించడం నిజంగా విషాదకరం” అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘ఆసియా సంతతివారిలో, ఆఫ్రికన్ అమెరికన్ సంతతివారిలో, లాటినోలలో, నల్ల జాతివారిలో ఈ వైరస్ పేట్రేగడం, ఎందరో వ్యక్తులు దిక్కుతోచని స్థితిలో మరణించడం నిజంగా శోచనీయం. ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకూడదు. ఈ వర్గాల మీద వైరస్ ప్రభావం ఇతర వర్గాల కంటే అధికంగా ఉంది. దీన్ని మనం ఆమోదించకూడదు. ప్రోత్సహించకూడదు” అని ఆమె స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం దీని మీదే దృష్టి కేంద్రీకరిస్తోందని ఆమె తెలిపారు.
అన్ని వర్గాలనూ సమానంగా చూడడానికి, జాతి వివక్షను తగ్గించడానికి తమ ప్రభుత్వం ఒక ప్రత్యేక జాతి సమానత్వ కార్యాచరణ దళాన్ని ఏర్పాటు చేశామని, తమ పాలనలో అటువంటి వివక్షలను, అసమానతలను బైడెన్ ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించరని ఆమె తేల్చి చెప్పారు.






