ఎన్నికలు సమీపిస్తున్నా మారని బైడెన్ తీరు.. డెమాక్రాటిక్ పార్టీలో తీవ్ర ఆందోళన
ప్రెసిడెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తనతో డెమోక్రాటిక్ పార్టీలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే మతిమరుపు, తడబాట్లతో తీవ్ర విమర్శలపాలైన బైడెన్, తాజాగా మరోసారి అదే పొరపాటు చేశారు. పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి నేపథ్యంలో బైడెన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తప్పులు మాట్లాడారు. బ్యాలెట్ బాక్సులకు బదులు బ్యాటిల్ బాక్సులు (యుద్ధపు పెట్టేలు) అని సంభోధించారు. దీంతో అక్కడే ఉన్న డెమోక్రాటిక్ పార్టీ నేతలు తలలు పట్టుకున్నారు.
నేను మన ప్రజాస్వామ్యం కోసం గట్టిగా మాట్లాడటం కొనసాగిస్తాను. మన రాజ్యాంగం, చట్ట నియమాల కోసం నిలబడతా. అమెరికాలో మా విభేదాల పరిష్కారానికి బ్యాటిల్ బాక్సు ను నమ్ముతాం. ఇప్పుడు కూడా మేం వాటిని బ్యాటిల్ బాక్సులోనే పరిష్కరించుకుంటాం. బుల్లెట్లతో కాదు అని వ్యాఖ్యానించారు. అయితే, బ్యాలెట్ బాక్సులు అనడానికి బదులు బ్యాటిల్ బాక్సులు అని తప్పుగా మాట్లాడి మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచారు. దాంతో అధ్యక్షుడి మాటలతో డెమోక్రాటిక్ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.






