భారత్ తో అనుబంధం మరువలేనిది…కాంగ్రెస్ మెన్ మీక్స్
అమెరికా ప్రగతిలో భారతసంతతి ప్రజల పాత్ర ప్రశంసనీయమని, అదే సమయంలో భారత్‌తో తనకు ఉన్న అనుబంధం మరువలేనిదని కాంగ్రెస్‌మెన్ గ్రెగరీ మీక్స్ అన్నారు. డిసెంబర్ 2వ తేదీన కాంగ్రెస్‌మెన్ రాజా కృష్ణమూర్తి సహకారంతో భారత సంతతి ప్రజలు ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో గ్రెగరీ మీక్స్ మాట్లాడారు. ఈ సందర్భంగా గత సంవత్సరం తాను ఇండియాలో పర్యటించినప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం చైనా నుంచి ఎదురవుతున్న ముప్పును, కోవిడ్ మహమ్మారి తీవ్రతపై ఆయన మాట్లాడారు.
ఇండియాతో ఉన్న ప్రత్యేక అనుబంధం ద్వారా భవిష్యత్తులో కూడా భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడుతుందని చెప్పారు. మహాత్మాగాంధీ, మార్టిన్‌లూథర్ కింగ్ ప్రభావం తనపై ఉందని అంటూ, ప్రత్యేక అనుబంధంతో భారత్‌తో కలిసి పనిచేయాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాలను బలపరచడంలో భారత అమెరికన్ సంతతి ప్రజలు చేస్తున్న కృషిని మరువలేమన్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీతో తాను ఇటీవల న్యూయార్క్ లో సమావేశమైన సంగతిని గుర్తు చేస్తూ, తాను మరోసారి భారత్‌కు వెళ్ళాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా పలువురు భారతీయులు మాట్లాడుతూ, యుఎస్-ఇండియా పౌర అణు ఒప్పందం కుదర్చడంలో కీలకపాత్ర పోషించినందుకు మీక్స్ కు ధన్యవాదాలు చెప్పారు. ఎక్స్ పోర్ట్ కంట్రోల్ యాక్ట్ ను సడలించాలని ఈ సందర్భంగా యుఎస్ ఇండియా సెక్యూరిటీ కౌన్సిల్ ప్రెసిడెంట్ రమేష్ కపూర్ కోరినప్పుడు తాను ఈ విషయమై ఇతరులతో చర్చిస్తానని ఆయన సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు భారత సంతతి ప్రజలు పాల్గొన్నారు. రమేష్ కపూర్‌తోపాటు రాజేందర్ డిచ్పల్లి (యుఎస్ ఇండియా సెక్యూరిటీ కౌన్సిల్ – డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్), భరత్ బరాయ్, అమెరికన్ జూవిష్ కమ్యూనిటీ ప్రతినిధి నిస్సిమ్ ర్యూబెన్, రొనాక్ దేశాయ్, దిలీప్ చౌహాన్, డా. హరిశుక్లా, హిరెన కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






