ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ అనుకున్నది సాధించారు. ఆయన విజయం సంపూర్ణమైంది. మిగిలిన ఆ ఒక్కటీ ఆయన ఖాతాలోకి వెళ్లింది. దీంతో ఇదీ విజయమంటే, ట్రంప్ మామూలోడు కాదని ఆయన అభిమానులు, ప్రజలు ఆకాశానికెత్తేస్తున్నారు. ఆయన అకౌంట్లో చేరిన ఆ ఒక్కటీ మరేదో కాదు కీలకమైన ఆరిజోనా రాష్ట్రం. యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో భాగంగా స్వింగ్ రాష్ట్రాల్లో ఒకటైన ఆరిజోనాను ట్రంప్ గెలుచుకున్నారు. అక్కడి 11 ఎలక్టోరల్ ఓట్లను దక్కించుకోవడంతో ఆయనకు వచ్చిన ఓట్లు 312కు చేరాయి. దీంతో అమెరికాలోని ముఖ్యమైన ఏడు స్వింగ్ స్టేట్స్ ట్రంప్ వశమయ్యాయి.
డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మొత్తంగా 226 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ల నుంచి ఆరిజోనాను నెగ్గిన వ్యక్తిగా జో బైడెన్ నిలిచారు. కానీ ఈసారి తిరిగి ఆరిజోనాను సొంతం చేసుకున్నారు ట్రంప్. ఏకంగా ఏడు స్వింగ్ స్టేట్స్ను వశం చేసుకొని ఔరా అనిపించారు. ఆరిజోనా ఫలితం ఆఖర్లో తేలగా.. అంతకంటే ముందు నెవడా స్టేట్ రిజల్ట్ వచ్చింది. ఇందులో ట్రంప్ విజయదుందుభి మోగించారు. 2004లో జార్జ్ డబ్ల్యూ బుష్ నెగ్గిన తర్వాత రిపబ్లికన్ అభ్యర్థి నెవడాను సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఆరిజోనాలోనూ విక్టరీతో ట్రంప్ విజయం పరిపూర్ణమైంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ మరోసారి సమరోత్సాహంతో దూసుకొచ్చారు. 78 ఏళ్ల వయసులో అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మరోసారి వైట్‌హౌస్‌లో కాలు పెట్టబోతున్నారు. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ.. డెమోక్రాట్లను కంగుతినిపిస్తూ అమెరికా అధ్యక్ష పీఠంపై పాగా వేశారు. ఓడిపోయినప్పటి నుంచి పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి అనుకున్నది సాధించారు. చరిత్ర సృష్టించారు. ఎప్పుడో 131 సంవత్సరాల కిందట నాలుగేళ్ల విరామం తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికైన క్లీవ్‌లాండ్ సరసన చేరారు. ఇలా అమెరికా అధ్యక్షుడిగా విరామం తర్వాత మళ్లీ ఎన్నికవడం ఇది రెండోసారి మాత్రమే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దుమ్ము రేపారు. హోరాహోరీ పోరు తదితర విశ్లేషణలన్నింటినీ తోసిరాజంటూ డెమొక్రాట్ల అభ్యర్ధి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై ఘనవిజయం సాధించారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి వెల్లడైన ఫలితాల్లో విజయానికి కావాల్సిన 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల మార్కును ట్రంప్ అలవోకగా దాటేశారు. తద్వారా నాలుగేళ్ల విరామం తర్వాత రెండోసారి అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్నారు.
డెమొక్రాట్ నేత గ్రోవర్ క్లీవ్‌లాండ్ 1884 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి 1885-89 మధ్య అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన రెండోసారి పోటీచేసి త్రుటిలో ఓడిపోయారు. మళ్లీ 1892 ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుని.. 1893లో పీఠాన్ని అధిష్ఠించారు. అప్పటికి మొత్తం 444 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉండగా.. క్లీవ్‌లాండ్ 277 ఓట్లతో ఘన విజయం సాధించారు. కాగా, అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కరు మాత్రమే నాలుగుసార్లు వరుసగా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ రెండో ప్రపంచ యుద్ధంలాంటి రాజకీయ పరిస్థితుల కారణంగా 1932, 1936, 1940, 1944 ఎన్నికల్లో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన తర్వాత వరుసగా రెండుసార్లు అధ్యక్షులుగా అయినవారి జాబితా చాలా పెద్దదే. జార్జ్ వాషింగ్టన్ (1789, 1792), థామస్ జెఫర్సన్ (1800, 1804), జేమ్స్ మాడిసన్ (1808, 1812), జేమ్స్ మోన్రో (1816, 1820), ఆండ్రూ జాక్సన్ (1828, 1832), అబ్రహం లింకన్ (1860, 1864), యులిసెస్ గ్రాంట్ (1868, 1872), విలియన్ మెకిన్లీ (1896, 1900), ఉడ్రో విల్సన్ (1912, 1916), డ్వైట్ ఐసన్‌హోవర్ (1952, 1956), రిచర్డ్ నిక్సన్ (1968, 1972), రొనాల్డ్ రీగన్ (1980, 1984), బిల్ క్లింటన్ (1992, 1996), జార్జ్ డబ్ల్యూ బుష్ (2000, 2004), బరాక్ ఒబామా (2008, 2012).
గ్రోవర్ క్లీవ్‌లాండ్ తర్వాత అమెరికా చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక నేతగా ట్రంప్ నిలిచారు. ఆ క్రమంలో పలు ఇతర రికార్డులూ సొంతం చేసుకున్నారు. అత్యంత ఎక్కువ వయసులో అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన వ్యక్తిగా కూడా 78 ఏళ్ల ట్రంప్ నిలిచారు. క్రిమినల్ అభియోగాల్లో దోషిగా తేలిన ఏకైక మాజీ అధ్యక్షునిగా ట్రంప్ ఇప్పటికే చెత్త రికార్డును మూటగట్టుకోవడం తెలిసిందే. తాజా విజయంతో అలాంటి చరిత్రతో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన తొలి నేతగా కూడా నిలిచారు. పైగా పాపులర్ ఓటు కూడా గెలుచుకోవడంతో ట్రంప్ విజయానికి పరిపూర్ణత చేకూరినట్టయింది. 2016లో ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా నెగ్గినప్పుడు ఆయన కంటే ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌కు 28 లక్షల ఓట్లు ఎక్కువగా రావడం తెలిసిందే. ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా పోలైన ఓట్లలో ట్రంప్ ఇప్పటికే హారిస్ కంటే ఏకంగా 50 లక్షలకు పై చిలుకు ఓట్ల మెజారిటీ సాధించారు. 20 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన రిపబ్లికన్ అధ్యక్షునిగా నిలిచారు. అంతేగాక తనకు మాయని మచ్చగా మిగిలిన 2020 అధ్యక్ష ఎన్నికల ఓటమి తాలూకు చేదు గుర్తులను కూడా ఈ గెలుపుతో చెరిపేసుకున్నారు. బైడెన్ విజయాన్ని తిరస్కరిస్తూ తన మద్దతుదారులను క్యాపిటల్ హిల్‌పై దాడికి ఉసిగొల్పి క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవడంతో ట్రంప్ రాజకీయ భవితవ్యం ముగిసినట్టేనని అంతా భావించారు. అలాంటి స్థితి నుంచి పుంజుకుని నాలుగేళ్ల తర్వాత ఆయన సాధించిన ఘనవిజయం రిపబ్లికన్ పార్టీలో ఆనందోత్సాహాలు నింపగా 60 ఏళ్ల హారిస్ ఓటమితో డెమొక్రాట్లు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు.
విజయం ఖాయం కాగానే ట్రంప్ తన భార్య మెలానియాను ఆప్యాయంగా అక్కుని చేర్చుకుని ముద్దాడారు. ఫ్లోరిడాలోని తన వెస్ట్‌పామ్ బీచ్ నివాసం వెలుపల భారీగా గుమిగూడిన అభిమానులకు అభివాదం చేశారు. రన్నింగ్‌మేట్ జేడీ వాన్స్‌తో తన ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం కుటుంబంతో కలిసి అమెరికా ప్రజలనుద్దేశించి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు.
అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికన్లకు సువర్ణయుగం రాబోతోందన్నారు. మెజార్టీ ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించిన అనంతరం ఫ్లొరిడాలోని తన పామ్ బీచ్ లో ప్రసంగించిన కాబోయే అధ్యక్షుడు ట్రంప్ తొలి ప్రసంగం చేశారు. అందరికీ ధన్యవాదాలు’ అంటూ ట్రంప్ తన విజయోత్సవ ప్రసంగాన్ని ప్రారంభించారు. అమెరికాకు మంచి రోజులు వచ్చాయని, స్వర్ణయుగం రాబోతోందని ట్రంప్ తన విజయాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎలక్టోరల్ ఓట్లతో పాటు పాపులర్ ఓట్లలోనూ తనకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయని చెప్పారు. తన గెలుపుతో అమెరికాకు మేలు జరుగుతుందని, తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో తనపై జరిగిన హత్యాయత్నం ఘటననూ ట్రంప్ ప్రస్తావించారు. ‘అమెరికాకు, అమెరికన్లకు సేవ చేయడానికే దేవుడు నా ప్రాణాలు కాపాడాడని చాలామంది నాతో చెప్పారు. ఆ రోజు జరిగిన హత్యాయత్నం నుంచి తనను ప్రాణాలతో బయటపడేయడం వెనకున్న కారణం ఇదే. దేశాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాపై ఉందనే కాపాడాడు. ఇప్పుడు ఆ బాధ్యతను నెరవేర్చే సమయం వచ్చింది. దేశానికి సేవ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. మీరు, నేను, మనమంతా కలిసి అమెరికాను గ్రేట్ గా తీర్చిదిద్దుకుందాం’ అంటూ ట్రంప్ భావోద్వేగానికి గురయ్యారు. ఇక అమెరికాలోకి అక్రమ వలసలు ఉండవు. అందరూ చట్టబద్ధంగానే రావాల్సి ఉంటుంది. సరిహద్దులు మూసివేస్తా. అక్రమ వలసలు అడ్డుకుంటాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తానంటూ చెప్పారు. ‘నా విజయంలో నా వెన్నంటి ఉన్న నా కుటుంబానికి కృతజ్ఞతలు. ఇది మొత్తం అమెరికన్లు గర్వించే విజయం. వైఎస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా చిలుకూరి బాగా పనిచేశారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా వాన్స్ ఎంపిక సరైనదేనని తేలింది. తొలుత వాన్స్ ఎంపికపై వ్యతిరేకత వచ్చింది.’అని ట్రంప్ గుర్తు చేశారు. ట్రంప్ ప్రసంగించిన వేదికపైనే ట్రంప్ కుటుంబ సభ్యులతో పాటు ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ కూడా ఉన్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయమైపోయింది. దీంతో రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కేందుకు ఆయన సిద్ధమయ్యారు.
ట్రంప్‌కు అన్నింటా మెజారిటీ
అమెరికా ఎన్నికల్లో కౌంటింగ్ జరిగిన చివరి రాష్ట్రమైన ఆరిజోనానూ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుచుకున్నారు. అక్కడి 11 ఓట్లు ట్రంప్ ఖాతాలో పడ్డాయి. దీంతో మొత్తం 7 స్వింగ్ రాష్ట్రాల్లోనూ ఆయన సంపూర్ణ విజయం సాధించినట్లయింది. ట్రంప్‌నకు మొత్తం 312 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ 226 వద్దే ఆగిపోయారు. కాగా ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీకి ఎలక్టోరల్ ఓట్లు 312 వచ్చింది. డెమోక్రటిక్ పార్టీకి 226 వచ్చింది. అలాగే పాపులర్ ఓట్లు రిపబ్లికన్ పార్టీకి 7,45,32,699 ఓట్లు వచ్చాయి. డెమోక్రటిక్ పార్టీకి 7,08,56,199 ఓట్లు వచ్చాయి. సెనెట్‌లో 52 సీట్లను రిపబ్లికన్ పార్టీ చేజిక్కించుకోగా, డెమోక్రటిక్ పార్టీ 47 వద్ద ఉంది. అలాగే ప్రతినిధుల సభలో కూడా రిపబ్లికన్ పార్టీ 216 సీట్లు, డెమోక్రటిక్ పార్టీకి 209 సీట్లు ఉన్నాయి. దీంతో ట్రంప్ తాను అనుకున్నది చేసేందుకు వీలైంది. ఏ బిల్లు పెట్టినా అన్నీ చోట్ల రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ ఉన్నందున బిల్లులు ఈజీగా పాసయిపోతాయని అంటున్నారు.
మోదీ అభినందనలు…
అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో విజయం సాధించి, మరోసారి బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. చారిత్రాత్మక ఎన్నికల్లో విజయం సాధించిన నా మిత్రుడు ట్రంప్‌కు హృదయపూర్వక అభినందనలు అని ట్విటర్లో పేర్కొన్నారు. ‘మీ గత పదవీకాలంలో సాధించిన విజయాల మాదిరి.. ఈసారి కూడా భారత్, అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మా సహకారాన్ని పునరుద్దరించ డానికి ఎదురు చూస్తున్నాను. ఇద్దరం కలిసి ఇరు దేశాల ప్రజల అభివృద్ధికి, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించ డానికి కృషి చేద్దాం’ అని పేర్కొన్నారు.






