600 డాలర్లు కాదు… 2వేల డాలర్లు ఇవ్వండి
అమెరికా ఉభయసభల్లో 900 బిలియన్ డాలర్ల కోవిడ్ ప్యాకేజీ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. కరోనాతో ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న అమెరికన్లకు ప్రతి ఒక్కరికి 600 డాలర్లు ఇవ్వాలంటూ ఆ బిల్లులో పొందుపరిచారు. అయితే ఆ నిబంధనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఉద్దీపన ప్యాకేజీని మరింత పెంచాలని ఉభయసభలను ట్రంప్ కోరారు. అమెరికన్లకు కనీసం రెండు వేల డాలర్లు ఇవ్వాలంటూ ఆయన ప్రతిపాదించారు. భార్యభర్తలకు కనీసం నాలుగు వేల డాలర్లు ఇవ్వాలన్నారు. ట్విట్టర్లో వీడియో మెసేజ్ పోస్టు చేసిన ట్రంప్.. దీనిపై అభ్యర్థన చేశారు. బిల్లులో ఉన్న అనవసరమైన అంశాలను తొలగించాలన్నారు. ఉద్దీపన ప్యాకేజీ నిజంగా అవమానకరంగా ఉందన్నారు. కోవిడ్ రిలీఫ్ బిల్లు అని అంటున్నాం, కానీ ఆ బిల్లులో ఎటువంటి ఉపశమనం లేదని ట్రంప్ అన్నారు. ఉభయసభల్లో పాసైన కోవిడ్ ప్యాకేజీ బిల్లుపై ట్రంప్ సంతకం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ బిల్లు చట్టంగా మారుతుంది.






