DC vs PBKS: కెఎల్ రాహుల్ విధ్వంశం, సరికొత్త రికార్డులు..!
అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 264 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఆది నుంచే ఒత్తిడిలోకి నెట్టిన ఢిల్లీ బ్యాటర్లు, మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఢిల్లీ ఓపెనర్ కేఎల్ రాహుల్(Kl Rahul) ఈ మ్యాచ్‌లో అసాధారణ ఇన్నింగ్స్‌తో చరిత్ర సృష్టించాడు.
కేవలం 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్సర్లతో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేవలం 47 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసిన రాహుల్, ఢిల్లీ క్యాపిటల్స్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అదే విధంగా.. ఐపిఎల్ చరిత్రలో 150 పరుగులు చేసిన తొలి ఇండియన్ బ్యాటర్ గా రికార్డులు సృష్టించాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్ ముందు పంజాబ్ బౌలర్లు తేలిపోయారు. కేఎల్ రాహుల్‌కు తోడుగా నితీష్ రాణా(Nitish Rana) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 220 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. రాణా కేవలం 44 బంతుల్లో 91 పరుగులు చేసి సెంచరీకి చేరువలో అవుట్ అయినప్పటికీ, జట్టు భారీ స్కోరు సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. మరో పది పరుగులు చేసి ఉంటే.. ఐపిఎల్ లో భారీ భాగస్వామ్యం నమోదు అయ్యేది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, జేవియర్ బార్ట్లెట్ చెరో వికెట్ తీసినప్పటికీ, పరుగులను మాత్రం అడ్డుకోలేకపోయారు. పంజాబ్ కింగ్స్ ముందు ఇప్పుడు 265 పరుగుల భారీ లక్ష్యం ఉంది. ఈ భారీ ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు ఎంతవరకు పోరాడతారో చూడాలి.








