ఇన్స్టాగ్రామ్ లో అదిరిపోయే ఫీచర్: మీ రీల్‌ను AIతో మార్చి పోస్ట్ చేసినా దొరికిపోతారు !
మీరు ఎంతో కష్టపడి ఒక రీల్ తయారుచేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ అయ్యేసరికి మరో అకౌంట్లో అదే వీడియో ప్రత్యక్షమైంది. పైగా మీ పేరు ఎక్కడా లేకుండా, ఆ వీడియోను వాళ్లే తయారుచేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి అనుభవం చాలామంది క్రియేటర్లకు ఎదురవుతూనే ఉంది. ఇప్పుడీ కాపీ కొట్టే వ్యవహారానికి ఇన్స్టాగ్రామ్ ఒక చెక్ పెట్టబోతోంది. అసలు వీడియోను కాపీ చేసినా, AI సాయంతో దాని రూపురేఖలు మార్చి మళ్లీ పోస్ట్ చేసినా పట్టుకునే కొత్త టూల్‌ను తీసుకొస్తోంది.
మీ వీడియో ఎక్కడ కనిపించినా ఇట్టే తెలిసిపోతుంది!
ఇప్పటివరకు ఫేస్బుక్లో అందుబాటులో ఉన్న ‘కంటెంట్ ప్రొటెక్షన్’ (Content Protection) ఫీచర్‌ను ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌కూ విస్తరిస్తున్నారు. నవంబర్ 17న ఈ విషయాన్ని మెటా ప్రకటించినట్లు టెక్ క్రంచ్ వెల్లడించింది. ఈ టూల్ ప్రత్యేకత ఏమిటంటే.. మీ ఒరిజినల్ రీల్స్‌ను ఎవరైనా తీసుకుని తమ అకౌంట్లో మళ్లీ అప్లోడ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ గుర్తిస్తుంది. వెంటనే మీకు అలర్ట్ పంపిస్తుంది. ఆ తర్వాత ఆ కాపీ వీడియో విషయంలో ఏం చేయాలనేది మీరే నిర్ణయించుకోవచ్చు.
ఉదాహరణకు, మీ వీడియోను కాపీ చేసిన వ్యక్తి అకౌంట్లో అది కనిపించకుండా బ్లాక్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఫేస్‌బుక్‌లోనూ ఆ వీడియోను ఇతరులకు కనిపించకుండా చేయవచ్చు. లేదంటే ఆ వీడియోకు ‘Original by’ అనే లేబుల్ జోడించి, అసలు వీడియో మీ అకౌంట్లో ఉందని చూపించవచ్చు. అప్పుడు కాపీ వీడియో చూసే వాళ్లు కూడా అసలు క్రియేటర్ ఎవరో తెలుసుకోగలుగుతారు.
కాపీ కొట్టారని ప్రతిసారీ బ్లాక్ చేయాల్సిన పనిలేదు!
ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఎవరో మీ వీడియోను వాడుకున్నారని తెలిసిన వెంటనే దాన్ని తొలగించాల్సిన అవసరం లేదు. ఆ వీడియోను అలాగే ఉంచి, దానికి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి? ఎంతమంది చూస్తున్నారు? ఎలా పెర్ఫామ్ చేస్తోంది? అనేది గమనించవచ్చు. ఒకవేళ ఆ వీడియోపై మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే మీ క్లెయిమ్‌ను వెనక్కి తీసుకుని, దాన్ని యథావిధిగా కనిపించేలా అనుమతించవచ్చు.
ఇవి కూడా చదవండి
ఈ ఫీచర్లో చేరేందుకు అర్హత ఉన్న క్రియేటర్లకు ఇన్స్టాగ్రామ్ వారి యాక్టివిటీ ఫీడ్‌లో ఆహ్వానం పంపిస్తుంది. అందులో చేరిన తర్వాత కొత్తగా పోస్ట్ చేసే ఒరిజినల్ వీడియోలకు ఆటోమేటిక్‌గా రక్షణ లభిస్తుంది. అంతేకాదు, గతంలో పోస్ట్ చేసిన వీడియోలను కూడా విడిగా ఎంచుకుని ఈ రక్షణ పరిధిలోకి తీసుకురావచ్చు.
అయితే ఒక సమస్య రావచ్చు. కొందరికి సొంతంగా రెండు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉంటాయి. మరికొందరు తమ వీడియోలను బ్రాండ్ పార్ట్నర్లకు ఉపయోగించుకునే అనుమతి ఇస్తుంటారు. అలాంటి సందర్భాల్లో కూడా సిస్టమ్ వాటిని కాపీలుగా గుర్తిస్తే ఇబ్బందే కదా! అందుకే ఇన్స్టాగ్రామ్ ‘Allow List’ అనే ఆప్షన్ ఇస్తోంది. మనకు అనుమతి ఉన్న అకౌంట్లను ఇందులో చేరిస్తే వాటి పోస్టులను కాపీలుగా పరిగణించదు.
AIతో వీడియో ముఖం మార్చినా దొరికిపోతారా?
ఇప్పటివరకు ఒక వీడియోను యథాతథంగా కాపీ చేసి పోస్ట్ చేస్తే గుర్తించడం ఒక ఎత్తు. కానీ AI టెక్నాలజీ వచ్చాక పరిస్థితి మారిపోయింది. ఒరిజినల్ వీడియోలోని వ్యక్తుల స్థానంలో వేరే వాళ్లను పెట్టొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ మార్చేయొచ్చు. విజువల్స్ మొత్తం కొత్తగా తయారుచేసినా, అసలు క్రియేటర్ గొంతును మాత్రం అలాగే ఉంచొచ్చు. అప్పుడు అది పాత వీడియో కాపీ అని గుర్తించడం అంత సులభం కాదు.
ఇవి కూడా చదవండి
ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఈ సమస్యపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఒక క్రియేటర్ ఒరిజినల్ వీడియోలోని ఆడియోను తీసుకుని, AIతో కొత్త విజువల్స్ జోడించి మరో వీడియో తయారుచేసినా గుర్తించే వ్యవస్థను పరీక్షించబోతోంది. రాబోయే కొన్ని వారాల్లో కొద్దిమంది క్రియేటర్లతో ఈ ప్రయోగం ప్రారంభం కానుంది. తర్వాత కంటెంట్ ప్రొటెక్షన్‌లో చేరిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ క్రియేటర్లకు దీన్ని విస్తరించాలని భావిస్తోంది.
ఇంతటితో ఆగడం లేదు. ఇతరుల వీడియోలను పదేపదే AI టూల్స్‌తో మార్చి, తమ అకౌంట్లలో పోస్ట్ చేసే వాళ్లపైనా చర్యలు తీసుకోవాలని మెటా ఆలోచిస్తోంది. అలాంటి అకౌంట్లకు, కంటెంట్‌కు లభించే రీచ్‌ను తగ్గించే మార్గాలను పరిశీలిస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస మార్పులు!
ఈ వారం ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన అప్డేట్లలో ఇది ఒకటి మాత్రమే. అంతకుముందు మెటా ‘Direct’ పేరుతో ప్రత్యేక మెసేజింగ్ యాప్‌ను టర్కీ, థాయ్‌లాండ్‌లో పరీక్షించడం ప్రారంభించింది. ఇందులో మరో విశేషం ఏమిటంటే.. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేకపోయినా ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్‌తో సైన్ అప్ చేసి మెసేజింగ్ సేవలను ఉపయోగించుకోవచ్చు.
మరోవైపు, అమెజాన్ ఇన్ఫ్లుయెన్సర్ అకౌంట్లను కనెక్ట్ చేసుకున్న క్రియేటర్లు తమ పోస్టులు, రీల్స్‌లో అమెజాన్ అఫిలియేట్ లింకులను ఆటోమేటిక్‌గా జోడించుకునే సదుపాయాన్ని కూడా తీసుకొచ్చింది.
అయితే ….
AIతో మార్చిన వీడియోలను గుర్తించే ఫీచర్ ఎప్పటి నుంచి అందరికీ అందుబాటులోకి వస్తుందో ఇంకా చెప్పలేదు. ముఖ్యంగా వీడియోలోని దృశ్యాలన్నీ మార్చేసి, అసలు వ్యక్తి గొంతును మాత్రమే ఉపయోగిస్తే ఈ టూల్ ఎంత కచ్చితంగా గుర్తిస్తుందన్నది చూడాలి. ఎందుకంటే AIతో కంటెంట్‌ను సృష్టించడం ఎంత సులభమవుతోందో, ఇతరుల కష్టాన్ని తమదిగా మార్చుకోవడం కూడా అంతే సులభమవుతోంది. ఈ రెండింటి మధ్య అసలు క్రియేటర్ల హక్కులను ఇన్స్టాగ్రామ్ ఎంతవరకు కాపాడగలదన్నదే ఇప్పుడు కీలకం.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







