మూడు వారాల సమయం.. లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వారాల సమయం ఇస్తున్నామని, ధాన్యం కొనకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని వైఎస్ షర్మిల ప్రకటించారు. ఇందిరాపార్క్ దగ్గర వైఎస్ఆర్టీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు వేదన దీక్షలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల కోసం తాను దీక్ష చేస్తే సీఎం కేసీఆర్కు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. లోటస్పాండ్లో దీక్షకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. స్టేజ్ వేయనివ్వడం లేదు, వేసినా తీసేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసుల జులుం నడుస్తోందన్నారు. ప్రతి గింజా కొంటామన్న కేసీఆర్ మాట నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనడం చేతకాక కేసీఆర్ ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మెడలు వంచైనా సరే కొనేలా చేస్తామని అన్నారు.













