లొంగిపోనున్న నక్సలైట్ లీడర్ గణపతి?
కరడుగట్టిన నక్సలైట్, దశాబ్ధాలుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న సిపిఐ (మావోయిస్ట్) కీలక నేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు ప్రభుత్వానికి లొంగిపోనున్నారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ, పోలీసు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. మావోయిస్ట్ ఉద్యమ సారధిగా పేరొంది, దాదాపుమూడున్నర దశాబ్ధాలుగా ఉద్యమంలో ఉన్న కీలక నేత కావడం, అతని తలపై మహారాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి రివార్డు కూడా ప్రకటించడం తో గణపతి లొంగుబాటు సంచలనంగా మారింది.
జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ గ్రామానికి చెందిన రైతు కుటుంబం గణపతిది. ఉన్నత చదువులు చదివిన గణపతి.. సైన్స్ గ్రాడ్యుయేట్, కరీంనగర్ కళాశాలలో బిఎడ్ చేశారు. అనంతరం ఆయన అన్నల బాట పట్టారు. అప్పటి నుంచి ఉద్యమంలో వివిధ హోదాల్లో పనిచేశారు. అనారోగ్య కారణాలతో 2018లో ఆయన కేంద్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం 74 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యాలు చుట్టుముట్టడంతో ఆయన లొంగిపోవాలని నిశ్చయించుకుని పోలీసు పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు గాను ఆయన పలు షరతులు పెట్టారని, అందులో తన అనారోగ్యాలకు చికిత్స కూడా ఒకటని అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి లభించిన తర్వాత ఆయన లొంగుబాటు ప్రక్రియ మొదలవుతుంది. అయితే ఈ విషయమై ఇంకా ప్రభుత్వం నిర్ధారించాల్సి ఉంది.













