రాజయ్య రాజీనామాకు కారణమేంటి..?
బీఆర్ఎస్కు మరోషాక్ తగిలింది. స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈనెల 10న కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. రాజయ్య రాజీనామాతో వరంగల్ రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ నుంచి స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ టికెట్ ఆశించారు. తనకు టికెట్ గ్యారంటీ అని గట్టిగా విశ్వసించారు.
అయితే కడియం శ్రీహరి రూపంలో ఆయనకు గట్టిపోటీ ఎదురైంది. చివరకు కేసీఆర్ కడియం శ్రీహరికి టికెట్ కేటాయించడంతో రాజయ్య తట్టుకోలేకపోయారు. అంతే కాదు కిందపడి, రోదించారు. ఈ పరిణామంతో రాజయ్య అనుచరులు సైతం ఆందోళనకు గురయ్యారు. ఆరు నెలల నుంచి మానసిక వేదనకు గురవుతున్నానని, ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినా… 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అవమానం చేసినా… విధేయుడిగా ఉన్నానన్నారు.
ముఖ్య నేతలు ప్రజలతీర్పు అంగీకరించకపోవడం కలిచి వేసిందని, క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ కరువైందన్నారు రాజయ్య. స్థానిక, రాష్ట్ర నాయకత్వం లోపంతో కార్యకర్తలు, నాయకులు కష్టాల పాలవుతున్నారని, ప్రజా సమస్యలు కేసీఆర్ దృష్టికి తీసుకుపోయే పరిస్థితి ఈరోజుకీ లేదన్నారు. మాదిగ ఆస్థిత్వంపై దెబ్బ కొట్టేలా బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందని తాటికొండ రాజయ్య ఆరోపించారు. 2014లో తొలిసారి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన తర్వాత రాజయ్యకు ఉపముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖమంత్రిగా పదవి ఇచ్చారు. అయితే కొన్ని నెలల తర్వాత పదవి నుంచి తొలగించారు. పనితీరు సరిగ్గా లేదన్న కారణం చూపించారు. ఇది రాజయ్యతో పాటు ఆయన కమ్యూనిటీలోనూ అసంతృప్తి కలిగించింది.













