ఈ గోస తెలంగాణలోనే కాదు.. దేశం మొత్తం : కేసీఆర్
వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నా సీఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో పండించే వడ్డను కొంటరా, కొనరా అని కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం సూటిగా సమాధానం చెప్పకుండా వంకర టింకరగా సమాధానం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గోస తెలంగాణలోనే కాదు దేశం మొత్తం ఉందన్నారు. రైతు చట్టాలను రద్దు చేయండని ఏడాదిగా ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్నారని గుర్తు చేశారు. వానాకాలం పంటనే కొనే దిక్కు లేదు కానీ కేంద్ర ప్రభుత్వం యాసంగి పంటను ఎక్కడి నుంచి కొంటుందని ఎద్దెవా చేశారు.
కేంద్రంలో దిక్కుమాలిన ప్రభుత్వం ఉందని నిప్పులు చెరిగారు. దేశాన్ని పాలించిన అన్ని పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. హంగర్ ఇండెక్స్‌లో భారతదేశం 101 స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ కంటే భారత్ దీన స్థితిలో ఉందన్నార. బీజేపీ అబద్దాలు మాట్లాడుతూ అడ్డగోలు పాలన చేస్తోందని మండిపడ్డారు. ఐటీఆర్ ప్రాజెక్టు ఇవ్వమంటే ఇవ్లేదు. ప్రతి జిల్లాకు నవోదయాలు ఇవ్వమంటే ఇవ్వలేదు. రైతు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు రాజీ పోరాటం చేస్తామన్నారు. అనేక సమస్యలను పెండింగ్‌లో పెట్టారు. కుల గణన చేయాలని తీర్మాణం చేసి పంపితే ఇప్పటి వరకు దిక్కు లేదన్నారు.
సమస్యలను పక్కకు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. నీళ్లివ్వకుండా రాష్ట్రాల మధ్య తగాదాలు పెడుతున్నారు. సమస్యలను ఎత్తి చూపితే పాకిస్థాన్ అని విద్వేషాలు రెచ్చగొడుతోంది బీజేపీ అన్నారు. కరెంట్ కోసం తెలంగాణ 30 ఏళ్లు ఏడ్చిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాకే కరెంట్ సమస్య తీరిందన్నారు. కరెంట్ మోటర్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెబుతోంది. రైతు కడుపు నిండా కరెంట్ ఇచ్చేది తెలంగాణే. బీజేపీకి చరమగీతం పాడితేనే ఈ దేశానికి విముక్తి అని కేసీఆర్ కేంద్రం నిప్పులు చెరిగారు.













