కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వండి
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి సంబంధింది 16 అంశాలను పరిష్కరించాలని కోరారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారిగా ఢిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రధాని అధికార నివాసంలో జరిగిన ఇరువురి సమావేశం గంటకుపైగా సాగింది. ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలతోపాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సిన నిధులు, ఇతర అంశాలపై కేసీఆర్ ప్రధానితో చర్చించారు. సచివాలయ నిర్మాణం, రాజీవ్ రహదారి విస్తరణకు అనువుగా బైసన్ పోలో మైదానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని విన్నవించారు. రక్షణ శాఖ ఇచ్చే భూమికి బదులు భూమి ఇవ్వడానికి, పరిహారం చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
కృష్ణా జలాలపై తెలంగాణ వేసిన పిటిషన్లనకు కృష్ణా ట్రైబ్యునల్‌కు బదిలీ చేయాలని కోరారు. మొత్తం పదహారు అంశాలపై ఆయన ప్రధానికి వినతిపత్రం సమర్పించడంతోపాటు వాటిపై కూలంకషంగా చర్చించారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలన్నింటీని సాధ్యమైనంత త్వరగా నెరవేర్చేందుకు కృషి చేస్తామని ప్రధానమంత్రి మోదీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అన్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనలపైనా సంబంధిత మంత్రిత్వ శాఖలకు ఆదేశాలిస్తామని చెప్పినట్లు సమచారం.













