ఖమ్మం ఎంపి అభ్యర్థి జయ్ తాళ్ళూరి ?
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) పూర్వ అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధికార భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)లో ఆయన చేరనున్నారని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఆయన ఖమ్మం జిల్లా నుంచి ఎంపి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. అమెరికాలో తానా అధ్యక్షుడిగా ఆయన చేసిన సేవలు కమ్యూనిటీలో ఆయనకు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. అలాగే ఖమ్మం జిల్లాలో తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన ఎప్పటి నుంచో పలు సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సేవా కార్యక్రమాల వల్ల ఆయనకు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. దానికితోడు అధికార బిఆర్ఎస్లో ఆయన చేరితే ఆయన భద్రాచలం వాసి అయిన జయ్ తాళ్లూరిని తమ పార్టీలో ఇప్పటి నుండే క్రియాశీలకం చేయడం ద్వారా ఖమ్మం పార్లమెంట్ తోపాటు చుట్టుపక్కల ఉన్న శాసనసభ నియోజకవర్గాల్లో కూడా మంచి ఫలితాలు రావట్టవచ్చని BRS పార్టీ లెక్కలేస్తున్నట్లుంది. కాకపోతే ఇప్పటివరకు జయ్ తాళ్లూరి తన మనసులోని మాటను బహిరంగంగా ఎక్కడా బయటికి వ్యక్తం చేయలేదు. కానీ ఇదే విషయంపై ఖమ్మం జిల్లాలో స్థానిక పత్రికలు ఇప్పటికే అనేక కథనాలు ప్రచురించాయి. కాబట్టి రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













