SIR: ఎన్నికల సంఘం అడ్డగోలు పనితీరుకు ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్!
భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలు వెన్నెముక లాంటివి. ఇందుకు అవసరమైన ఓటర్ల జాబితా రూపకల్పనలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరు ప్రస్తుతం తీవ్ర దుమారానికి కారణమవుతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ పారదర్శకతపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. కేవలం సాంకేతిక లోపాలు లేదా అధికారుల ఉదాసీనతగానే కాకుండా, దీని వెనుక పెద్దఎత్తున రాజకీయ కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నియోజకవర్గంలో వెలుగుచూసిన ఒక షాకింగ్ ఘటనే ఇందుకు నిదర్శనం. బతికున్న భార్య ఓటును తొలగించాలంటూ.. ఏకంగా 24 ఏళ్ల కిందటే మరణించిన భర్త పేరుతో ఆన్లైన్లో ఫారం-7 సమర్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతటి అపహాస్యానికి గురవుతుందో చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ.
ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్‌పూర్ ప్రాంతంలో వెలుగుచూసిన ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. ఏరియా నంబర్ 5-జీటీఆర్ 2671501 కలిగిన బిల్లీస్ సుల్తానా అనే మహిళకు ఇక్కడ ఓటు హక్కు ఉంది. అయితే, ఆమె భర్త మహమ్మద్ రఫీయుద్దీన్ 2002లోనే మరణించారు. పాతికేళ్ల కిందటే చనిపోయిన ఆ వ్యక్తి పేరుతో ఆన్లైన్లో ఫారం-7 దరఖాస్తు వచ్చింది. తన భార్య బతికే ఉన్నప్పటికీ ఆమె చనిపోయిందంటూ ఆ ఫారం సమర్పించారు. దీని ఆధారంగా ఎలాంటి క్షేత్రస్థాయి విచారణ చేయకుండానే అధికారులు ఆ మహిళ ఓటును జాబితా నుంచి తొలగించేశారు. ఎన్నికల సంఘం యంత్రాంగం వైఫల్యానికి ఇది అద్దం పడుతోంది. బాధితురాలు తన ఓటు హక్కు కోసం మళ్లీ ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడటం ఈ వ్యవస్థలోని డొల్లతనాన్ని ఎత్తిచూపుతోంది.
ఈ ఒక్కటే కాదు.. గోషామహల్, బహదూర్‌పుర, అంబర్పేట్, కార్వాన్, చంద్రాయణగుట్ట వంటి అనేక నియోజకవర్గాలలో ఇలాంటి బోగస్ ఫాం 7ల దరఖాస్తులు పెద్దఎత్తున వచ్చాయి. కొన్ని చోట్ల బూత్ స్థాయి అధికారులపై కొందరు వ్యక్తులు తమ రాజకీయ లబ్ధి కోసం ఒత్తిడి తెచ్చి ఇష్టానుసారంగా ఓట్ల తొలగింపునకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేవలం మాన్యువల్‌గానే కాకుండా ఆన్లైన్ ద్వారా కూడా ఈ బోగస్ దరఖాస్తులు వచ్చాయి. ఇది ఈసీ సాంకేతిక భద్రతా లోపాలను బట్టబయలు చేస్తోంది. నిబంధనల ప్రకారం చిరునామా మారినప్పుడు లేదా కుటుంబ సభ్యులు మరణించినప్పుడు మాత్రమే ఫాం 7ను వ్యక్తిగతంగా సమర్పిస్తారు. బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకోవాలి. కానీ, ఎటువంటి మరణ ధృవీకరణ పత్రాలు లేకుండా, కనీస నిబంధనలు పాటించకుండా ఆన్లైన్లో దరఖాస్తులు ఆమోదం పొందుతుండటం వెనుక రాజకీయ ప్రమేయం ఉందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
ఈ పరిణామాలు కేవలం పరిపాలనాపరమైన లోపాలకే పరిమితం కావట్లేదు. దీని వెనుక రాజకీయ కోణాన్ని తెలియజేస్తున్నాయి. ఎన్నికల్లో తమ ప్రత్యర్థుల ఓట్లను కొల్లగొట్టడానికి, ఓటర్ల జాబితాను తారుమారు చేయడానికి కొన్ని రాజకీయ శక్తులు ఏజెంట్ల ద్వారా ఈ కుట్రలకు తెరలేపాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బూత్ స్థాయి ఓట్ల తొలగింపు ప్రక్రియను ఆయుధంగా మలచుకుని.. తమకు గిట్టని వారి ఓట్లను గల్లంతు చేసే ప్రమాదకర ధోరణి పెరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్వయంగా ముషీరాబాద్‌లో పర్యటించి, డెత్ సర్టిఫికెట్ కూడా లేకుండా ఫాం 7 ఎలా తీసుకున్నారంటూ అధికారులను నిలదీయడం, సమగ్ర విచారణకు ఆదేశించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఓటర్ల జాబితా సవరణ అనేది నిబద్దతతో చేయాల్సిన పని. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఆన్లైన్ దరఖాస్తుల మీదనే ఆధారపడకుండా, ప్రతి ఫాం 7 వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేకుంటే ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న నమ్మకమే పోతుంది.








