సీపీఐ సీనియర్ నేత గుండా మల్లేశ్ ఇక లేరు
సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ (75) కన్నుమూశారు. గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుత మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. పార్టీలో కింది స్థాయి నుంచి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన ఆయన ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకుడిగా కార్మికుల మన్ననలు పొందారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా, కార్యవర్గ సభ్యుడిగా, జాతీయ కమిటీ సభ్యుడిగా మల్లేశ్ పనిచేశారు.













