23 వరకు సీఎం కేసీఆర్ కు సమయం.. లేదంటే ప్రగతిభవన్ ను
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జేఏసీగా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్, ఇందిరాపార్క్ దగ్గర ఏసీలతో ధర్నాలు, దీక్షలు చేస్తారా? అని ప్రశ్నించారు. రైతుల పక్షాన పోరాటం చేయాలంటే రైతుల కళ్లాల దగ్గరకు వెళ్ళాలన్నారు. లేదంటే చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించాలన్నారు. బీజేపీ నేత బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి మోదీని నిలదీయాలని డిమాండ్ చేశారు. 19 తేదీ నుంచి 23 వరకు కళ్లాల్లోకి కాంగ్రెస్ ఉద్యమం చేస్తుందని ప్రకటించారు. ఈ నెల 23 వరకు కేసీఆర్కు సమయం ఇస్తున్నానమని, తర్వాత రైతులతో కలిసి ప్రగతిభవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ధాన్య సేకరణపై కార్యాచరణ ఏంటో సీఎం కేసీఆర్ స్పష్టం చేయాలని అన్నారు.













